ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తున్న టీడీపీ ఆశావహుల్లో చంద్రబాబునాయుడి ప్రకటనలు గుబులు రేపుతున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తున్నారు. తాజాగా పుంగనూరు నియోజకవర్గ్ ఇన్చార్జ్గా చల్లా బాబు పేరు ప్రకటించారు. అలాగే అన్నమయ్య జిల్లా టీడీపీ శ్రేణుల సమావేశంలో కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థులుగా ఆర్.శ్రీనివాస్‌రెడ్డి, గంటా నరహరి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు.
అలాగే గత నెలలో కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. తాజాగా పీలేరు అభ్యర్థిగా నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించడం విశేషం.
టికెట్లు దక్కిన వాళ్లు మాత్రం ఖుషీగా ఉండగా, ప్రకటనకు నోచుకోని ఆశావహులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లానే తీసుకుంటే తిరుపతి, మదనపల్లె, తంబళ్లపల్లె, సత్యవేడు, చిత్తూరు, చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి తదితర నియోజకవర్గాలకు అధికారికంగా చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయలేదు.
తిరుపతిలో సుగుణమ్మ, నగరిలో దివంగత ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాశ్, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్‌రెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తున్న చంద్రబాబు, తమ విషయంలో మాత్రం ఎందుకు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారనే ప్రశ్న ఎదురవుతోంది.
చంద్రబాబు కేవలం అక్కడక్కడ మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తుండడం వల్ల వస్తున్న ఇబ్బందులుగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ఓడిపోతారనే చోటే అభ్యర్థులను ప్రకటిస్తున్నారని పార్టీలోనే మరో వాదన వినిపిస్తోంది.
ఇందుకు ఉదాహరణగా కడప లోక్‌సభ, డోన్, పుంగనూరు తదితర అభ్యర్థుల ప్రకటనను గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన వ్యవహారం, మిగిలిన వారిలో అనుమానాల్ని, ఆందోళనల్ని రేకెత్తిస్తున్నాయనేది వాస్తవం.