తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి (65) మూడోసారి కరోనా మహమ్మారిబారిన పడ్డారు. కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లలో ఆయన దాంతో ఇబ్బంది పడ్డారు. మొదటి వేవ్‌లో కరోనాబారిన పడ్డ ఆయన తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. రెండో వేవ్‌లో కూడా ఆయన తప్పించుకోలేకపోయారు.
రెండోవేవ్‌లో ఆయన కరోనాతో తీవ్ర ఇబ్బందిపడ్డారు. అప్పట్లో కరోనా తీవ్ర ప్రభావం చూపడంతో చెన్నైలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆయన మహమ్మారికి గురయ్యారు. పెగాసస్ ఉదంతంపై సమీక్షించేందుకు ఆయన రెండు రోజుల క్రితం విజయవాడ వెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ వేసిన ఉప సంఘం చైర్మన్‌గా ఆయన పెగాసస్, ఫోన్ ట్యాపింగ్, డేటా చోరీలను నిగ్గు తేల్చే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వరుసగా రెండురోజుల పాటు కమిటీ సభ్యులు, ఐటీ, హోంశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇదే క్రమంలో స్వల్ప జ్వర, జలుబు లక్షణాలతో బాధపడుతున్నారు. గురువారం వచ్చేసరికి జ్వరం పెరిగింది. దీంతో ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా అని నిర్ధారణ అయ్యింది.
వైసీపీ ప్లీనరీ సమావేశాలను కూడా చూసుకుని ఈ నెల 10న తిరుపతి వెళ్లాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆయన తిరుపతికి తిరిగి వెళ్లారు. ఇదిలా వుండగా తిరుపతిలో ఉదయం, సాయంత్రం గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కొన్ని రోజులుగా ఆయన విస్తృతంగా జనంలో తిరుగుతున్నారు. మహమ్మారి నుంచి కరుణాకరరెడ్డి త్వరగా కోలుకోవాలని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.