ఓటర్లుకు ప్రభుత్వం తాయిలాలు ఇస్తుంది. మరి పార్టీ కార్యకర్తలకు? పార్టీ ఇవ్వాల్సిందే. అందుకే తెలుగుదేశం పార్టీ తన బూత్ కమిటీ బాధ్యులకు తాయిలాలు పంచేసింది. గ్రామాల్లో వుండే బూత్ కమిటీ కన్వీనర్లు అందరికీ తెలుగుదేశం పార్టీ అయిదారు వేల విలువైన సెల్ ఫోన్ లను బహుమతిగా అందించింది. అయితే ఇక్కడ ఓ కండిషన్ పెట్టింది. అయిదారు వేల విలువైన సెల్ ఫోన్ ను వెయ్యి రూపాయలు కట్టి తీసుకోమని చెప్పింది.
నియోజకవర్గానికి కనీసం 250 నుంచి 300 కు పైగా బూత్ లు వుంటాయి. ఈ మేరకు ఫోన్ లు అన్ని జిల్లాలకు వరుసగా చేరుతున్నాయి. అయితే చాలాచోట్ల ఎమ్మెల్యేలు ఆ వెయ్యిరూపాయల ఖర్చు భరించి ఫోన్ లు తీసుకుని, బూత్ కమిటీ కన్వీనర్లకు అందచేస్తున్నారు. అంటే 300 ఫోన్లు అంటే మూడు లక్షల రూపాయలు భారం ఎమ్మెల్యేలు భరిస్తున్నారన్నమాట.
ఇదిలావుంటే బాబుగారు గ్రామాల్లో మహిళలకు సెల్ ఫోన్ లు ఇవ్వడం వెనుక మర్మం ఇదే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని కోట్ల సెల్ ఫోన్ ఆర్డర్లు కంపెనీలకు ఇచ్చి, పనిలో పనిగా పార్టీకి కూడా ఫోన్ లు తీసుకుని, కార్యకర్తలకు పంచుతున్నారని, అందువల్ల పార్టీ పై భారం పడదని, ఆ వెయ్యి రూపాయలకే కంపెనీలు ఆఫ్ ది రికార్డుగా సరఫరా చేసి వుంటాయని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.