“ఎన్టీఆర్ బయోపిక్ ను నేను 12సార్లు చూస్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ తో నేను 12 సినిమాలు చేశాను. నాకు 12సార్లు అవకాశం ఇచ్చిన ఆ మహానుభావుడి రుణాన్ని ఇలా తీర్చుకుంటాను.” సరిగ్గా 2 నెలల కిందట దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ సందర్భంగా నిండు సభలో రాఘవేంద్రరావు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను 12సార్లు చూసేంత దమ్ము నీకుందా అంటూ సోషల్ మీడియాలో ఈ దర్శకుడిపై సవాళ్లు విసురుతున్నారు నెటిజన్లు.
రాఘవేంద్రరావుపై ఈ విధంగా ట్రోలింగ్ జరగడానికి కారణం ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెగెటివ్ షేర్స్ రాబడుతోంది. అంటే థియేటర్ రెంట్, కరెంట్ బిల్లుల కంటే తక్కువ మొత్తం వసూళ్లన్నమాట. ఇలాంటి సినిమాను ఒకసారి చూసి భరించడమే కష్టం. అలాంటిది 12 సార్లు చూసేంత దమ్ము ఉందా అంటూ రాఘవేంద్రరావును ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
మహానాయకుడు కంటే ముందు కథానాయకుడు సినిమాను ఎన్నిసార్లు చూశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తమ్మీద ఎన్టీఆర్ బయోపిక్ కారణంగా ఎన్నడూ లేనిది సోషల్ మీడియాలో ఇలా అడ్డంగా దొరికిపోయారు రాఘవేంద్రరావు.
నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వసూళ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో కేవలం రెండున్నర కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. స్టార్ హీరోలు నటించిన చిత్రాల్లో అతి తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఎన్టీఆర్-మహానాయకుడు నిలిచిపోయింది.
గతంలో బాలయ్య నటించిన పరమవీరచక్ర సినిమా అతిచెత్త సినమాగా నిలిస్తే, దాన్ని క్రాస్ చేయడానికి ఆఫీసర్ సినిమాకు దాదాపు ఏడేళ్లు పడింది. కానీ అంతలోనే ఆఫీసర్ సినిమాను కూడా క్రాస్ చేసింది ఎన్టీఆర్-మహానాయకుడు మూవీ.