వైసీపీపై ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బాంబ్ పేల్చారు. పెగాసస్ వ్యవహారం మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేల్చుకునేందుకు కారణమైంది. పెగాసస్, ఫోన్ ట్యాపింగ్, డేటా చోరీపై నిగ్గు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సంఘం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించిందన్నారు. తమకు వ్యతిరేకులని గుర్తించిన వాళ్ల ఓట్లను తొలగించి నాటి ప్రతిపక్ష పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు గత ప్రభుత్వం కుట్ర పన్నిందని చేసిన ఆరోపణలపై టీడీపీ దీటుగా కౌంటర్ ఇచ్చింది.
పీఏసీ చైర్మన్ కూడా అయిన పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ ఉపసంఘంలో టీడీపీ సభ్యులకు చోటెక్కడ అని నిలదీశారు. ఇది ఉపసంఘం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులతో పాటు ప్రత్యర్థులపై నిఘా పెట్టడం నిజం కాదా? అని బాంబు పేల్చారు. సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తులపై నిఘా పెట్టాల్సింది పోయి, అందుకు భిన్నంగా ప్రభుత్వం అనవసరంగా ప్రయాస పడుతోందని విమర్శించారు.
పెగాసస్‌పై వైసీపీది బోగస్ ప్రచారమని తప్పు పట్టారు. ఎవరెవరిపై నిఘా పెట్టారనేది నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. పెగాసస్‌పై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారిస్తోందని, ఏపీ ప్రభుత్వానికి ఏవైనా అనుమానాలు, సమాచారం వుంటే వారికి అందజేస్తే సరిపోతుందని ఆయన సలహా ఇచ్చారు. పెగాసస్‌పై ఏపీ ప్రభుత్వ హడావుడి అంతా ఆ పార్టీ అభద్రతా భావాన్ని తెలియజేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.