ఎన్టీఆర్..చరణ్…ఏమైంది?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సులువైన పని ఏమిటంటే ఓ ట్వీట్ వేయడం. మునివేళ్ల మీద అలా అలా ఫోన్ లో ట్వీటడం. కానీ అలా అని ఎవరికి పడితే వారికి, దేనికి పడితే దానికి…

సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సులువైన పని ఏమిటంటే ఓ ట్వీట్ వేయడం. మునివేళ్ల మీద అలా అలా ఫోన్ లో ట్వీటడం. కానీ అలా అని ఎవరికి పడితే వారికి, దేనికి పడితే దానికి ట్వీట్ వేయరు. ఆ విషయంలో చాలా పొదుపుగా వుంటారు. బాంధవ్యాలు, బంధుత్వాలు, మొహమాటాలు, రాజకీయాలు ఇలా చాలా చూసుకుంటారు.

నిన్నటికి నిన్న టాలీవుడ్ జనాలు ట్వీట్లు వేయాల్సిన సంగతి వెల్లడయింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యుసభ సభ్యత్వం లభించింది. సరే, కొంత మంది ట్వీట్ లు వేసారు అభినందిస్తూ. కానీ అది కాదు విషయం. 

ఆ కుటుంబంతో ఎంతో అనుబంధం వున్న ఎన్టీఆర్ ఇంకా ట్వీట్ వేయలేదు. జక్కన్న..జక్కన్న అంటూ కలవరిస్తూ, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ ల్లో నటించిన ఎన్టీఆర్ ఎందుకు ఇంకా ట్వీట్ వేయలేదో ఆయనకే తెలియాలి.

ఇక రామ్ చరణ్..ఆర్ఆర్ఆర్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. అతని పాత్ర సృష్టికర్త కదా విజయేంద్ర ప్రసాద్. అంతే కాదు మగధీరలో కూడా నటించాడు. మరి ఎందుకు ఇప్పటి వరకు ట్వీట్ వేయలేదు?

సరే, ఈ ఇద్దరి సంగతి అలా వుంచితే మహేష్ బాబు కూడా వేయలేదు. త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. దానికి కథ విజయేంద్ర ప్రసాద్ నే ఇవ్వాలి కదా?

ఇక పవన్ కళ్యాణ్. ఈయన ట్విట్టర్ లో మరీ యాక్టివ్ గా వుండరు కానీ, ఈ మధ్య ఎవరైనా పోయినా, ఎవరైనా ప్రతిభ చూపినా ట్వీట్ లు వేస్తున్నారు. పైగా చాలా ఇంటర్వ్యూల్లో తనకు అభిమాన హీరో పవన్ నే అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకుంటూ వచ్చారు. మరి అందుకయినా పవన్ ఓ ట్వీట్ వేసి వుండాల్సింది.

నిన్న సాయంత్రం వార్త కదా, మెల్లగా అంతా ఈ సాయంత్రానికి వేస్తారేమో?