బాహుబలి రచయిత-దేశ సంస్కృతి

‘’శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తం గా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. అతను…

‘’శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తం గా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు…’’

ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్… సినిమా కథకుడు కోడూరి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ వేసిన ట్వీట్. ఓ సినిమా వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం తప్పు కాదు. సినిమా వాళ్లకు ఎడా పెడా పద్మ అవార్డులు ఇవ్వడం తప్పు కాదు. ఇదంతా మన రాజకీయ సంస్కృతిలో భాగం. కానీ విజయేంద్ర ప్రసాద్ భారతదేశం అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబించే కథలు అందించారు అన్నారు ప్రధాని. దానికే అభ్యంతరం. 

తెలుగు నాట అద్భుతమైన కథకులు, రచయితలు ఎందరో వున్నారు. భారత దేశ చరిత్ర మీద అనేక పుస్తకాలు అందించిన శివప్రసాద్ లాంటి చరిత్రకారులు వున్నారు. సినిమాలకు సంస్కృతి సంప్రదాయాల మీద కథలు అందించిన విశ్వనాధ్ వున్నారు. ఇలా ఎవరి జానర్ లో వారు దేశ సంస్కృతిని సుసంపన్నం చేసిన కథకులు, కవులు, రచయితలు తెలుగునాట ఎందరో వున్నారు. వీరి సరసన విజయేంద్ర ప్రసాద్ స్థానం ఎక్కడన్నదే ప్రశ్న.

అసలు విజయేంద్ర ప్రసాద్ రచనలు ఏమిటి? అన్నది చూద్దాం.

శ్రీకృష్ణ 2006…ఒక మగాడు ఎంత మందితో అయినా తిరగొచ్చు అనే పిచ్చి సిద్దాంతంతో పెడదారి పట్టిన కుర్రాడిని దారిలో పెట్డడానికి హీరోయిన్ కూడా అదే సిద్దాంతం వున్నట్లు నాటకం ఆడుతుంది. ఇద్దరు హీరోలతో సయ్యాట లాడుతుంది. అందులోంచి పుట్టే కామెడీ.

రాజన్న….తెలంగాణలోని ఓ పోరాట వీరుడి కథ ను తీసుకుని తీసిన సినిమా…ఆ కథ ఆయనది కాదు. స్ఫూర్తి తీసుకుని అల్లుకున్నది.

శ్రీవల్లి…ఓ ఫిక్షన్ థ్రిల్లర్

సింహాద్రి…సై…ఛత్రపతి..విక్రమార్కుడు దేశం సంస్కృతిని ఏ మేరక ప్రతిబింబించాయో అందరికీ తెలిసిందే.

యమదొంగ సినిమాలో యముడితోనే కామెడీలు, సరసాలు చేయించిన సినిమా.

బజరంగ్ బాయిజానీ..తెలుగులో ఏ సినిమా పాయింట్ తీసుకుని అల్లిందో తెలిసిందే. ఆ తెలుగు సినిమాకు ఇంగ్లీష్ సినిమా ప్రేరణ అన్నదీ తెలిసిందే.

మణికర్ణిక…తలైవి..ఈ రెండూ ఆయన స్వంత కథలు కావు. చరిత్ర లేదా జీవితగాథల ఆధారంగా ఆయన అందించిన స్క్రిప్ట్ లు.

ఇక మిగిలింది బాహుబలి..ఆర్ఆర్ఆర్.

చందమామ పత్రికలో కొన్ని దశాబ్దాల పాటు అనేకానేక జానపద నవలలు వచ్చాయి. వీటిని అందించిన రచయిత గిన్నెస్ రికార్డు కు కూడా ఎక్కారు. అలాంటి జానపద రచన తప్ప బాహుబలి దేశ సంస్కృతిని ప్రతిబింబించిది ఏమిటో తెలియాలి.

ఆర్ఆర్ఆర్. ఒక సారి దేశ భక్తుల కథ అంటారు. మరోసారి వారి ప్రేరణతో అల్లిన ఫిక్షన్ అంటారు. ఎవరైనా విమర్శిస్తే దేశభక్తుల కథ అనే అస్త్రం బయటకు తీస్తారు. మరి అల్లూరి తెల్ల వాళ్లకు ఊడిగం చేయడం అంటే అబ్బే…అది మేం అల్లుకున్న ఫిక్షన్ కథ అంటారు.

ఇక విజయేంద్ర ప్రసాద్ సినిమా కథల్లో శృంగారాలు, డబుల్ మీనింగ్ లు, ఇంకా..ఇంకా వగైరాల గురించి తెలిసిన సంగతే.

ప్రపంచ వ్యాప్తంగా పేరు రావడానికి ఆయన కథలు కాదు కారణం, ఆయన కొడుకు రాజమౌళి తీసిన సినిమాలు. అతని విజన్. అతని మేకింగ్.. వాటి వల్ల తండ్రి కి కథకుడిగా పేరు వచ్చి వుండొచ్చు. రాజమౌళి కి అందించని కథలను పక్కన పెడితే, వేరే వాళ్లకు అందించిన కథల్లో జాగ్వార్, మిత్రుడు, నా అల్లుడు, ఘరానా బుల్లోడో, సరదా బుల్లోడు లాంటి కథలే ఎక్కువ. బహుశా అవి మోడీ గారికి తెలిసి వుండే అవకాశం లేదు.

కోడూరి విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ ఇవ్వడం అభ్యంతరకరం కాదు. ఆయన కథలతో దేశ సంస్కృతిని ప్రతిబింబించారు అని అనడమే కాస్త బాధాకరంగా వుంది. ఈ బాధ చాలా మందికి వుంది. ట్విట్టర్ లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.