ర‌ఘురామ‌ను యాక్టివేట్ చేసే పాస్‌వ‌ర్డ్ ఇదే!

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఆ ప‌దం అంటే అస‌లు గిట్ట‌దు. ఆ ప‌దం గురించి విన‌డానికి, మాట్లాడ్డానికి ఆయ‌న అస‌లు ఇష్ట‌ప‌డరు. దీన్నిబ‌ట్టి ర‌ఘురామ‌ను ఆ ప‌దం ఎంత‌గా భ‌య‌పెడుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. ర‌ఘురామ…

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఆ ప‌దం అంటే అస‌లు గిట్ట‌దు. ఆ ప‌దం గురించి విన‌డానికి, మాట్లాడ్డానికి ఆయ‌న అస‌లు ఇష్ట‌ప‌డరు. దీన్నిబ‌ట్టి ర‌ఘురామ‌ను ఆ ప‌దం ఎంత‌గా భ‌య‌పెడుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. ర‌ఘురామ వెన్నులో వ‌ణుకు పుట్టించే ఆ ప‌ద‌మే “అరెస్ట్”.

అరెస్ట్ అనే మాట వింటే ర‌ఘురామ‌కృష్ణంరాజు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నెత్తిమీద వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకుంటాయి. అరికాళ్ల‌లో వ‌ణుకు మొద‌ల‌వుతుంది. అరెస్ట్ అనే పాస్‌వ‌ర్డ్ ర‌ఘురామ‌లో అన్ని అవ‌య‌వాల‌ను యాక్టివేట్ చేస్తుంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫ‌రూక్‌బాషాపై దాడికి సంబంధించి ర‌ఘురామ‌కృష్ణంరాజుతో పాటు ఆయ‌న కుమారుడు భ‌ర‌త్‌, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్‌పై తెలంగాణ పోలీసులు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ర‌ఘురామ‌ను అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇప్ప‌టికే సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేశారు.

అరెస్ట్‌కు సంబంధించి ర‌ఘురామ‌కు ఊర‌ట క‌లిగించే ఏకైక అంశం… తెలంగాణ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం. ఇదే ఏపీ పోలీసులు కేసు పెట్టి వుంటే …ఆయ‌న వెనుకాముందు చూసుకోకుండా సుర‌క్షిత ప్రాంతానికి ప‌రుగు తీసి వుండేవారు. 'బతికుంటే బలిసాకైనా తిని బతకొచ్చు' …కానీ ఏపీ పోలీసుల చేతిలో మాత్రం ప‌డొద్ద‌నేది ఆయ‌న ఫిలాస‌ఫీ. పొర‌పాటున త‌న‌ను అరెస్ట్ చేస్తే… ఆ ఊహే ఆయ‌న్ను భ‌య‌పెడుతుంది. గ‌తంలో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన ఆ రాత్రే ఆయ‌న్ను జీవితాంతం వెంటాడుతోంది.

సీఐడీ అధికారులు ఆ రాత్రి కొట్టిన దెబ్బ‌లు, వాటిని త‌ట్టుకోలేక అరిచిన అరుపుల‌తో గ‌ది మార్మోగిపోయింది. కొట్టార్రా బాబూ అని నెత్తీనోరూ కొట్టుకుంటూ దేశ‌మంతా చెప్పినా…ఆయ‌నది అర‌ణ్య‌రోద‌నైంది. అదే క‌దా ఆయ‌న‌లో జ‌గ‌న్‌పై మ‌రింత క‌క్ష పెంచింది. ఆ ఘ‌ట‌నే క‌దా ర‌ఘురామ‌లో పిరికితనాన్ని, భ‌యాన్ని పెంచింది. ఆ కాళ‌రాత్రే క‌దా… ఏపీకి వెళ్లాలంటే ర‌ఘురామ‌కు నిలువెల్లా వ‌ణుకు పుట్టించేది. తెల్లారితే చాలురా దేవుడా అనుకునేలా చేసిన ఆ రాత్రే క‌దా ర‌ఘురామ‌కు ప్రాణ‌భ‌యం అంటే ఏంటో తెలిసేలా చేసింది.

ఒకే ఒక్క అరెస్ట్ ఆయ‌న జీవిత‌, జీవ‌న గ‌మ్యాన్ని పూర్తిగా మార్చేసింది. ఎన్నో నిద్ర‌లేని రాత్రుల్ని మిగిల్చిన “అరెస్ట్‌”….అనే ప‌దం వింటే ఉండ‌దా మ‌రి భ‌యం? అయితే తెలంగాణ పోలీసులు కేసు పెట్ట‌డం ఊర‌ట‌నిస్తున్నా….సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్‌ర‌వీంద్ర వెనుక జ‌గ‌న్ ఉన్నాడ‌నే అనుమానం మాత్రం ఆయ‌న‌లో ఎక్క‌డో వ‌ణుకు పుట్టిస్తూనే ఉంది.  

సొదుం ర‌మ‌ణ‌