డేటా చోరీ, పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల గుట్టు రట్టు చేసేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని చైర్మన్‌గా నియమించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ పార్టీలో అత్యంత ముఖ్య నాయకుడైన భూమన ఎలాంటి పదవికి నోచుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టించుకోక పోయినా, స్పీకర్ తమ్మినేని పెద్ద మనసుతో ఆయనకు ఉపసంఘం చైర్మన్ పదవిని కట్టబెట్టారు.
తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేందుకు వరుస భేటీలు అవుతూ… ఇప్పటికి ఓ కొలిక్కి తెచ్చామని భూమన చెబుతున్నారు. 2016-19లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి పాల్పడ్డారని డేటా చోరీ అంశంపై విచారణకు శాసనసభ నియమించిన ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఇది చెప్పడానికి ఉప సంఘం, దానికొక చైర్మన్, సభ్యులు అవసరమా? అనేది ప్రశ్న.
నాటి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ల డైరెక్షన్‌లోనే డేటా చోరీ జరిగినట్లు ఉపసంఘం విచారణలో నిర్ధారణ అయ్యిందని భూమన అన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయిలో పోలీసు దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే నివేదికను శాసనసభకు సమర్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవే ఆరోపణలు ప్రతిపక్ష హోదాలో వైసీపీ చేసింది. అంతేకాదు, సంబంధిత అధికారులకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లైన తర్వాత , అది కూడా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పెగాసస్‌పై ఆరోపణలు చేశాక కొత్తగా ఏదో కనుగొన్నట్టు అసెంబ్లీలో చర్చ, విచారణ కోసం ఉపసంఘం ఏర్పాటు చేయడం వెనుక మతలబు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఉన్నతస్థాయిలో పోలీసు దర్యాప్తు జరిపించాల్సి వుందని భూమన కొసమెరుపు వ్యాఖ్యలు సరదాగా ఉన్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలన్నీ ‘సేవా మిత్ర’ అనే యాప్ నిర్వహించిన ఓ ప్రైవేటు ఏజెన్సీకి చేరడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వైసీపీ అప్పట్లో ఆరోపించింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర పన్నిందని నాడు వైసీపీ పెద్ద ఉద్యమమే చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఎందుకని కనీస విచారణ కూడా నిర్వహించలేకపోయిందనేది ప్రశ్న.
ప్రతిపక్ష హోదాలో వైసీపీ చేసిన ఆరోపణలనే, తాజాగా ఉపసంఘం చైర్మన్‌గా కరుణాకరరెడ్డి మరోసారి రిపీట్ చేస్తున్నారు. ఇంతకంటే వైసీపీ ప్రభుత్వం చేసింది, చేయబోయేది ఏమైనా వుందా? ఇక నివేదిక సమర్పించడమే తరువాయి అని భూమన చెబుతున్నారు. కనీసం కొండను తవ్వి ఎలుకనైనా ఈ ఉపసంఘం పట్టుకుంటుందా? ఇంత మాత్రం దానికి ఉపసంఘం పేరుతో హడావుడి ఎందుకో మరి!