పోలీసుల ట్రీట్ మెంట్ మారుతోందా..?

లాక్ డౌన్ కారణంగా పోలీసులు లాఠీలు పట్టుకుని రోడ్లపైకి వచ్చినవారిని బాదిపడేసే వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాఠీలకు శానిటైజర్లు పూసి మరీ ఆయుధ పూజ చేస్తున్నట్టు కొన్ని ఫన్నీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో…

లాక్ డౌన్ కారణంగా పోలీసులు లాఠీలు పట్టుకుని రోడ్లపైకి వచ్చినవారిని బాదిపడేసే వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాఠీలకు శానిటైజర్లు పూసి మరీ ఆయుధ పూజ చేస్తున్నట్టు కొన్ని ఫన్నీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారనే జోక్ బాగా ప్రచారంలోకి వచ్చింది.

ఇది అభినందించే విషయం కాకపోయినా.. కొన్ని సందర్భాల్లో పోలీసులు అంత గట్టిగా లేకపోతే పని జరగదు, ఎక్కడి జనం అక్కడ రోడ్లపైకి వచ్చి గుమికూడతారు. మాటలు చెప్పి వారిని ఇంటికి పంపించాలంటే వారం రోజులు పడుతుంది. అందుకే ఖాకీలు కాస్త కఠినమైన లాఠీ మార్గాన్నే ఎంచుకున్నారు.

మరోవైపు బిచ్చగాళ్లకు, ఫుట్ పాత్ పక్కన పడుకున్నవారికి పోలీసులు ఫుడ్ పార్సిల్స్ అందించడం, తమ వాహనాల్లోనే ప్రయాణికుల్ని ఇళ్ల వద్ద దించడం, వాటర్ బాటిల్స్ ఇచ్చే వీడియోలూ కూడా వారి మంచి మనసుకి తార్కాణాలుగా నిలిచాయి. ఇంటింటికీ పోలీసులే వెళ్లి నిత్యావసరాలను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీటి కంటే లాఠీచార్జ్ వీడియోలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి.

దీంతో ఏపీ పోలీసుల తీరుపై చిన్నపాటి సమీక్ష జరిగింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు హోం మినిస్టర్ ఆఫీస్ నుంచి పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. ఇకపై లాఠీలకు కాస్త పని తగ్గించడనేది దాని సారాంశం. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని, క్రమ శిక్షణ చర్యలు తీసుకోడానికి వెనకాడబోమని కూడా హోం మంత్రి హెచ్చరించినట్టు సమాచారం.

కొన్ని జిల్లాల్లో జర్నలిస్ట్ లు కూడా తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు చేశారు. సామాన్య జనం నుంచి కూడా ఫిర్యాదులందడంతో.. పోలీసుల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో ఇకపై పోలీసుల ట్రీట్ మెంట్ మారుతుందని అంటున్నారు.

అందర్నీ చూసుకుంటా.. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి