వైఎస్ జగన్ మీడియా సమావేశాలకు దూరం. ఆయన తొలి సమావేశం కూడా కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికే పెట్టారు. ఇదీ నిన్నటి వరకూ వినిపించిన విమర్శలు. వీటిల్ని విమర్శలుగానే పరిగణించినా అదే సమయంలో జగన్ ప్రెస్ మీట్లతో ప్రజలకు మరింత దగ్గరైతే బాగుండేదేమో అనే భావన సొంత పార్టీ నేతల్లో కూడా ఉంది. ఇప్పుడదే జరుగుతోంది. కేవలం తాను మంచి చేస్తే సరిపోదు, ఆ మంచిని రాష్ట్ర ప్రజలకు కచ్చితంగా చెప్పుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు జగన్.
అందుకే కరోనా నేపథ్యంలో వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల మధ్య నలిగిపోతున్న విద్యార్థుల గురించి కూడా సీఎం ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవానికి అప్పటికే సమస్య సద్దుమణిగింది, తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడి సర్దుబాటు చేశారు, క్వారంటైన్ కి ఒప్పుకున్నవారు ఏపీలోకి వచ్చారు, మిగతావారు తెలంగాణ హాస్టల్స్ కి తిరిగి వెళ్లారు. ఇక్కడ ఏ ఇబ్బందీ లేదు.
కానీ ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాన్ని అడ్డుకోవాలంటే ప్రజలకు వాస్తవాలేంటనేది చెప్పుకోవాల్సిందే. అసలేం జరిగిందనే విషయాన్ని వివరించాల్సిందే. నిన్న సీఎం జగన్ మీడియా సమావేశంలో చేసింది అదే. మన పిల్లలు అయినా, పరిస్థితి బాగోలేనందునే దూరం పెట్టాల్సి వచ్చిందని తల్లిదండ్రులకు వివరించారు జగన్. ఇలా చేయాల్సి వచ్చినందుకు బాధపడుతున్నానని చెప్పిన జగన్, పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించి విద్యార్థులెవరికీ ఇబ్బంది లేకుండా చేయగలిగామని అన్నారు.
గతంలోలా ఆలోచించి ఉంటే.. జగన్ ఈ విషయానికి ప్రెస్ మీట్ పెట్టేవారు కాదు, సమస్య పరిష్కారమైంది కాబట్టి, అధికారులే పరిస్థితిని ప్రజలకు వివరించేవారు. కానీ జగన్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాల కుట్రల్ని తిప్పికొట్టాలన్నా, ప్రజలకు తాను చేస్తున్న మంచి ఏంటనేది తెలియాలన్నా.. కచ్చితంగా వారితో మాట్లాడాలి, అది మీడియా ద్వారానే సాధ్యం అని డిసైడ్ అయ్యారు. ఈ మార్పునే జనం కోరుకున్నారు, జగన్ ఆచరణలో పెట్టారు.