ఇప్పుడు సోషల్ మీడియా వుంది. ప్రతి ఒక్కడూ సినిమాల మీద అభిప్రాయం చెపుతున్నాడు, రాస్తున్నాడు. ఒకప్పుడు వేదిక లేదు. ప్రింట్ మీడియాలో వచ్చే సమీక్షలే జడ్జిమెంట్. 1974 నాటికి చిన్న వూళ్లలో కనిపించే సినిమా పత్రికలు రెండే, విజయచిత్ర, సినిమా రంగం. అవి కూడా మంత్లీలు. 75, 76 నాటికి సితారా, జ్యోతిచిత్ర, వెండితెర, సినీ హెరాల్డ్ మార్కెట్‌లోకి వచ్చాయి. వీటన్నింటిలో సితారాకి డిమాండ్ ఎక్కువ. మొదట బ్లాక్ అండ్ వైట్‌లో 60 పైసలు, కలర్‌లోకి మారిన తర్వాత రూపాయి.
సితారా ఆకర్షణ ఏమంటే సినిమా సమీక్షలు. అవి గుడిపూడి శ్రీహరి రాసేవారు. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా అతిగా పొగడకుండా, తిట్టకుండా సినిమా కథని పరిచయం చేస్తూనే లోటుపాట్లు చెప్పేవారు. సినిమా విడుదలైన వారం తర్వాత సమీక్షలు వచ్చేవి. శుక్రవారం విడుదలైన సినిమా గురించి వచ్చే వారం చదవాలి. అప్పటికే సినిమా జాతకం తెలిసిపోయేది. సమీక్ష చదివి ఇప్పటిలా చూడాలా, వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సిన పనిలేదు. సినీ అభిమానులంతా చూసేసిన తర్వాత సమీక్ష చదవడం.
శ్రీహరి సమీక్షలు ఎంత పక్కాగా వుండేవంటే ఆయన హిట్ అంటే హిట్, యావరేజ్ అంటే యావరేజ్. సినిమా చూసిన తర్వాత ప్రతి వాళ్లు సమీక్షకులే. స్నేహితులతో అభిప్రాయాల్ని చెప్పుకుంటారు. తమ అభిప్రాయాలు ఎంత వరకూ కరెక్టో శ్రీహరి సమీక్ష చదివి తెలుసుకునే వాళ్లు.
ఒక రకంగా గుడిపూడి శ్రీహరి సమీక్షలకి ఆద్యుడు. అంతకు పూర్వం కూడా ఎందరో మహానుభావులున్నారు. (కమలాకర కామేశ్వరరావు, ముళ్లపూడి వెంకటరమణ). అయితే సుదీర్ఘ కాలం ప్రతి వారం రాసిన పాత్రికేయులు శ్రీహరే. వీక్లీలో రాసే సమీక్షకులకి కొంత వెసులుబాటు వుంటుంది. సినిమా మీద నలుగురి అభిప్రాయాలు తెలుసుకుని, బేరీజు వేసుకుని రాయొచ్చు. ఇప్పుడు వెబ్‌సైట్స్‌కి, యూట్యూబ్‌లకి సమీక్షలు చేసే వాళ్లకి ఆ అవకాశం లేదు. ఇక్కడ టైం ఇంపార్టెంట్. సినిమా చూస్తుండగానే జడ్జ్ చేసేసి, వెంటనే ఔట్‌పుట్ ఇచ్చేయాలి.
ఎక్కువ మంది సమీక్షకులు ఇప్పటికీ శ్రీహరి ఫార్మాట్ ప్రమాణీకాలనే అనుసరిస్తున్నారు. అది ఆయన గొప్పతనం. కథని ఎంత వరకు చెప్పాలో అంతే చెప్పి, బలాలు బలహీనతలు వివరించి , ప్రేక్షకులకి ఎంత వరకు ఎక్కుతుందో వివరించాలి.
శ్రీహరి మృతి తెలుగు సినిమా రంగానికి లోటు, ఆయన ఆత్మకి శాంతి కలగాలి.
జీఆర్ మహర్షి