బెదిరిస్తున్నార‌ని ఏపీ హైకోర్టు జ‌డ్జి చెప్పి వుంటే….!

త‌న‌ను అధికారులు బెదిరిస్తున్నార‌ని క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఒక‌వేళ ఇలాంటి వ్యాఖ్య‌లు ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయ‌మూర్తి చేసి వుంటే… ఈ పాటికి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌నే డిమాండ్లు…

త‌న‌ను అధికారులు బెదిరిస్తున్నార‌ని క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఒక‌వేళ ఇలాంటి వ్యాఖ్య‌లు ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయ‌మూర్తి చేసి వుంటే… ఈ పాటికి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌నే డిమాండ్లు వెల్లువెత్తేవి. మ‌న ఎల్లో చాన‌ళ్ల‌లో ఆస్థాన న్యాయ‌, రాజ‌కీయ విశ్లేష‌కులు ఇంతెత్తున ఎగిరేవాళ్లు. వీళ్ల‌కు తోడు స‌ద‌రు యాంక‌ర్ల పైత్యం తోడ‌య్యేది.

అవినీతిప‌రుల‌కు కర్ణాట‌క అవినీతి నియంత్ర‌ణ ద‌ళం క‌లెక్ష‌న్ సెంట‌ర్‌గా మారింద‌ని కామెంట్ చేసిన త‌న‌ను బ‌దిలీ చేయిస్తామంటూ కొంద‌రు అధికారులు ప‌రోక్ష బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ హెచ్‌పి సందేశ్ వాపోయారు. అయితే ఇలాంటి బెదిరింపుల‌కు తాను భ‌య‌ప‌డేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. న్యాయ‌మూర్తి ఉద్యోగం పోయినా బాధ‌ప‌డ‌న‌ని, రైతు కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, అవ‌స‌ర‌మైతే వ్య‌వ‌సాయం చేసుకుని బ‌తుకుతాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇలాంటి ప‌రిస్థితి ఏపీ హైకోర్టు జ‌డ్జికి ఎదురైనా, మ‌న న్యాయ‌మూర్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినా త‌ప్ప‌కుండా అధికార పార్టీ మెడ‌కు చుట్టి క‌థ‌నాలు వండివార్చేవాళ్లు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై దాడికి దిగిన జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఇంటికి సాగ‌నంపేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని భ‌య‌పెట్టేవాళ్లు. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌ను విజ‌య‌వాడ‌కు పంపార‌ని, ఏ క్ష‌ణంలోనైనా రాష్ట్ర‌ప‌తి పాల‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని రీతిలో డిబేట్లు నిర్వ‌హించేవారు.

న‌చ్చ‌ని పాల‌కులు అధికారంలో వుంటే, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల కామెంట్ల‌ను త‌మ‌కు అనుకూలంగా ఏ విధంగా మ‌లుచుకోవ‌చ్చో ఇప్ప‌టికే అనేక ఉదంతాలు తెలుగు స‌మాజం చూసింది. అందుకే క‌ర్ణాట‌క ఘాట్ వ్యాఖ్య‌లను మ‌నకు వ‌ర్తింప‌జేసుకుని మాట్లాడ్డం వెనుక ఉద్దేశం.