ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎంతగా అంటే… తమ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ఐఏఎస్ అధికారి ముందుకొచ్చేంతగా. ఇంతకంటే ఏ ముఖ్యమంత్రికైనా క్రెడిట్ ఏం కావాలి? జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నాడు–నేడు’ పథకం కింద విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన, అలాగే ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఆర్థిక స్తోమత లేని వాళ్లు చదువుకునేవిగా ముద్రపడిన ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత స్థాయి అధికారి తన పిల్లల్ని చదివించాలని ముందుకు రావడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. దీని వెనుక జగన్ విజన్ స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
ఐఏఎస్ అధికారి, శాప్ ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి తన కుమార్తె, కుమారుడిని విజయవాడ పటమటలోని కోనేరు బసవపున్నయ్య జెడ్పీ హైస్కూల్‌లో చదివించాలని ముందుకొచ్చారు. ప్రభాకరరెడ్డి సతీమణి లక్ష్మి తమ పిల్లలకు అడ్మిషన్ తీసుకున్నారు. కుమార్తెను 8వ తరగతి, కుమారుడిని 6వ తరగతిలో ఆమె చేర్పించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి పని చేసే సమయంలో కూడా తన పిల్లల్ని ప్రభుత్వ బడిలో ఆయన చదివించడం విశేషం.
మీడియాతో లక్ష్మి మాట్లాడుతూ ‘నాడు–నేడు’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఆంగ్ల మాధ్య మాన్ని అమలు చేస్తుండడంతో చేర్పించామన్నారు. ముఖ్యంగా పాఠశాలలో వసతులు, విశాలమైన ఆట స్థలం ఉండడం విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలకో దోహదం చేస్తాయన్నారు.