వాలంటీర్ల పై టీడీపీ క‌న్ను!

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చింది. స‌చివాల‌య ఉద్యోగుల‌కు చేయూత‌గా, ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధిగా వాలంటీర్లు నియ‌మితుల‌య్యారు. ఈ వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. క‌రోనా స‌మ‌యంలో…

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చింది. స‌చివాల‌య ఉద్యోగుల‌కు చేయూత‌గా, ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధిగా వాలంటీర్లు నియ‌మితుల‌య్యారు. ఈ వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. క‌రోనా స‌మ‌యంలో స‌చివాల‌య ఉద్యోగులు, వాలంటీర్ల సేవ‌లు అమూల్యం. స‌చివాల‌య ఉద్యోగుల ప్రొబేష‌న్‌ను ఇటీవ‌ల ఖ‌రారు చేశారు. దీంతో వారిలో ఆనందం క‌నిపిస్తోంది.

అయితే వాలంటీర్ల‌కు మాత్రం రూ.5 వేల గౌర‌వ వేత‌నం మాత్ర‌మే అందుతోంది. కానీ పాల‌న‌లో వారి ముద్ర బ‌లంగా ఉంది. ప్ర‌భుత్వం తాను అనుకున్న‌ది అమ‌లు చేసేందుకు వాలంటీర్ వ్య‌వ‌స్థ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోంది. ప్ర‌స్తుతం వాలంటీర్ వ్య‌వ‌స్థ స‌మాజంతో విడ‌దీయ‌లేని అనుబంధం ఏర్ప‌ర‌చుకుంది. ఈ వ్య‌వ‌స్థ రానున్న ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించ‌నుంది.

ఈ నేప‌థ్యంలో వాలంటీర్ల‌ను అధికార పార్టీకి మ‌రింత అంకిత భావంతో ప‌ని చేయించేందుకు వారి గౌర‌వ వేత‌నాన్ని రూ.10 వేల‌కు పెంచితే బాగుంటుంద‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. ప్ర‌తిదీ రేట్లు పెరిగి, ఖ‌ర్చులు రెండింత‌లైన ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం వాలంటీర్ల‌కు ఇచ్చే రూ.5 వేలు క‌నీసం పెట్రోల్ ఖ‌ర్చుకు కూడా రాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ విష‌యంలో వాలంటీర్లు అసంతృప్తిగా ఉన్నారు.

క‌నీసం రూ.10 వేల‌కు పెంచితే ఎన్నిక‌ల్లో వారే వైసీపీకి సైనికులుగా ప‌ని చేస్తార‌ని అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు చెబుతున్నారు. మ‌రోవైపు తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాలంటీర్ల గౌర‌వ వేత‌నాన్ని రూ.10 వేల‌కు పెంచుతామ‌నే హామీని ఎన్నిక‌ల‌కు ముందు ఇవ్వాల‌ని టీడీపీ ఆలోచిస్తోంది. ఇదే జ‌రిగితే జ‌గ‌న్ వేలితో ఆయ‌న కంటినే పొడిచిన‌ట్టు అవుతుంది.

ఎందుకంటే వాలంటీర్లు రూ.10 వేలు ఇచ్చే వారి వైపు ఉంటారే త‌ప్ప‌, రూ.5 వేల‌తో గొడ్డు చాకిరీ చేయించే పార్టీకి ప‌ని చేయాల‌ని ఎందుకు అనుకుంటారు? తాను నెల‌కొల్పిన వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వాలంటీర్ సైన్యం అసంతృప్తిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దృష్టి పెట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. లేదంటే ఆ అసంతృప్తిని చంద్ర‌బాబు సొమ్ము చేసుకోడానికి కాచుక్కూచున్నారు.