ప్రతిపక్షం అంటే ఓ కన్నేసి వుండాలి. కసితో వుండకూడదు. మోడీ ప్యాకేజ్ ను సోనియాగాంధీ మెచ్చుకున్నారు. అంతే తప్ప రంధ్రాన్వేషణ చేయలేదు. కానీ రాష్ట్ర భాజపా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం తన దారి వేరు అంటున్నారు. జగన్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్య బట్టడమే లక్ష్యం అంటున్నారు.
జగన్ లైట్ తీసుకున్నారట కరోనాను. ఎక్కడ లైట్ తీసుకున్నారు. లక్షలాది మందితో కూడిన వాలంటీర్ వ్యవస్థను సమర్థవంతగా వాడుకున్నారు కాబట్టే, ఇవ్వాళ గ్రామాల్లో కూడా కరోనా మీద అవేర్ నెస్ పెరిగింది. గ్రామాలకు కంచెలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఎంత మంది విదేశాల నుంచి వచ్చారన్న లెక్క పెర్ ఫెక్ట్ గా తేలింది. విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లకే వుంచి కట్టడి చేయగలిగారు. ఆంధ్రలో కరోనా అంకెలు హమ్మయ్య అని అనిపించేలా వున్నాయి. ఆందోళన కలిగించేలా లేవు.
పరిస్థితి ఇలా వుంటే, తట్టుకోలేక కన్నాలాంటి ఫక్తు రాజకీయ నాయకులు నెగిటివ్ గా చూసి నోరు పారేసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో ప్రభుత్వం ఏం చేస్తోందో? ఏం చేయలేదో? జనాలకు తెలియదా? అయినదానికి కాని దానికి, ప్రతిపక్షం అనే ఆలోచనతో ఏదో ఒకటి అంటూ పోతే జనం అనుమానిస్తారు. కన్నా ఆ స్థాయికి దిగిపోతున్నట్లు కనిపిస్తోంది.