ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత పాక్ పంజరం నుంచి ప్రేమ పావురం బయటికొచ్చింది. అసలు తానిక పాకిస్తాన్ నుంచి బయటపడ తాననే ఆశలు వదులుకున్న ఆ యువకుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో విముక్తి లభించింది.
పాకిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా పెద్దల మాట వినకుండా తాను తప్పు చేశానని పశ్చాత్తాప పడ్డాడు. సీపీ సజ్జనార్ …ప్రశాంత్‌ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. సీపీకి పాదాభివందనాలు చేశాడు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
2019, నవంబర్ 14న పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవాల్‌పూర్‌లో ఇద్దరు భారతీయ యువకుల్ని చోలిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిలో ప్రశాంత్ అనే యువకుడు విశాఖపట్నం వాసిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుర్తించారు. అయితే హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ సరిహద్దు దాటాడు.
గతంలో బెంగళూర్‌లో పనిచేస్తున్నప్పుడు పరిచయం అయిన అమ్మాయితో తమ కుమారుడు ప్రేమలో పడినట్టు ప్రశాంత్ తండ్రి బాబురావు అప్పట్లో చెప్పాడు. ప్రియురాలి కోసం తమతో విభేదించాడని, రెండేళ్లుగా కనిపించడం లేదని అప్పట్లో ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.
స్విట్జర్లాండ్‌లో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు గూగుల్ మ్యాప్‌లో రోడ్డు మార్గం వెతుకుతూ పాక్‌లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెళ్లాలనేది అతని ఆలోచనగా తెలిసింది. అప్పట్లో ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన 1.03 నిమిషాల నిడివి గల వీడియో వైరల్ అయ్యింది.
తనను కాపాడాలని అప్పట్లో అతను విన్నవించాడు. అయితే పాకిస్తాన్ వాదన మరోలా ఉండింది. తమ దేశంలో అక్రమంగా ప్రవేశించాడని, యూరప్ వెళ్లే ప్రయత్నంలో పట్టుబడినట్టు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. అక్రమ ప్రవేశంపై పాక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రశాంత్‌ను విడిపించుకునేందుకు అతని తండ్రి బాబురావు నానా ఇబ్బందులు పడ్డారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఆయన కలుసుకుని తమ కుమారుడిని ఎలాగైనా విడిపించాలని వేడుకున్నారు. ఆయన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఎట్టకేలకు రెండేళ్లకు ఫలించాయి.
మాదాపూర్ పోలీసులు ప్రశాంత్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మంగళవారం తీసుకొచ్చారు. ఇండియాలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో గొడవ పడి రెండేళ్లు, పాకిస్తాన్‌లో రెండేళ్లు కలిపి మొత్తం నాలుగేళ్ల పాటు ప్రశాంత్ తన కుటుంబానికి దూరం కావడం గమనార్హం. మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ …ప్రశాంత్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మీడియా సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ తాను తిరిగి వస్తానని అనుకోలేదన్నాడు. హైదరాబాద్ పోలీసులు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తాను రుణపడి ఉన్నట్టు ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. తన సమస్యను భారత్-పాక్ మధ్య సమస్యగా చూడకూడదని విజ్ఞప్తి చేశాడు. పాకిస్థానీయులు అంత చెడ్డవారేమీ కాదన్నాడు. రెండు దేశాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉన్నారన్నాడు. జైలులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకున్నట్టు ప్రశాంత్ వివరించాడు.
పాకిస్తాన్‌లో హిందీ మాట్లాడటం నేర్చుకున్నట్టు అతను తెలిపాడు. జైలులో భారతీయులతో పని చేయించరన్నాడు. జైలులో భారతీయుల కోసం ప్రత్యేక గదులు ఉండేవన్నాడు. తాను వెళ్లే ముందు అమ్మ ఆపేందుకు ప్రయత్నించిందన్నాడు. కానీ తల్లిదండ్రుల మాటలు వినకపోతే జీవితంలో కష్టాలు వస్తాయనేందుకు తన అనుభవాలే ఉదాహరణ అని చెప్పాడు. అమ్మ మాట విననందుకు నాలుగేళ్లు కుటుంబానికి దూరమైనట్టు ప్రశాంత్ అవేదన వ్యక్తం చేశాడు.