ఎలాంటి కథ చెబితే పవన్ కల్యాణ్ వెంటనే ఓకే చెబుతాడో దర్శకుడు పూరి జగన్నాధ్ ఇప్పటికే బయటపెట్టాడు. కథలో తుపాకులు, మెషీన్ గన్లు ఉంటే చాలు.. వెంటనే పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని గతంలో చెప్పుకొచ్చాడు. ఆయన సరదాగా చెప్పినా అందులో కొంత నిజం ఉంది. ఇప్పుడు మరో రచయిత పవన్ సినిమాలపై స్పందించాడు.
పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి కథ అవసరం లేదంటున్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆయన పాత సినిమాల్లో క్లిప్పింగ్ లు తీసి పేర్లు మార్చేస్తే సరిపోతుందంటున్నారు.
“పవన్ కల్యాణ్ సినిమాకు కథ రాయక్కర్లేదు. ఆయన సినిమాల్లో అక్కడక్కడ సీన్లు తీసి పేర్లు మార్చేస్తే సరిపోతుంది. పవన్ సినిమా చూడ్డానికి వచ్చే వాళ్లకు కథ అక్కర్లేదు. పవన్ పాటలు పాడాలి. అమ్మాయిలతో సరదాగా ఆడుకోవాలి, విలన్లను ఇరగ్గొట్టాలి. ఇవి ఉంటే చాలు. కథ అక్కర్లేదు.”
ఇలా పవన్ కల్యాణ్ కు కథ అక్కర్లేదంటూ తేల్చేశారు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. అయితే ఆయన ఈ విషయాన్ని పాజిటివ్ యాంగిల్ లోనే చెప్పారు. పవన్ తెరపై కనిపిస్తే చాలని, అంతకుమించి ఆయన అభిమానులు ఇంకేం ఆశించరు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
పవన్ కల్యాణ్ ఓ డైనమైట్ లాంటోడని, దాన్ని పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలని అన్నారు. అలాంటి డైనమైట్ కు కథ రాయడానికి పెద్దగా ఆలోచించక్కర్లేదంటున్నారు విజయేంద్ర ప్రసాద్.