కరోనా కష్టకాలం ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేసింది. మాస్క్ లు అలవాటు చేసింది, కరచాలనాలు, ఆలింగనాలు మరచిపోయేలా చేసింది. మాస్క్, శానిటైజర్ కవచకుండలాల్లా మనిషిని అతుక్కుని ఉండే పరిస్థితి. దాదాపు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇలాంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సినీ ఇండస్ట్రీ కూడా దీనికి అతీతమేం కాదు. సహజంగా సినిమా తెరకెక్కాలంటే 24 శాఖలు కలసి పనిచేయాల్సిందే. అయితే ఇప్పుడు కొత్తగా సినీ ఇండస్ట్రీలో మరో శాఖ కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 25వ శాఖగా వైద్యశాఖ చేరబోతోంది. అంతా కరోనా ప్రభావం.
అవును.. షూటింగ్ స్పాట్ లో మేకప్ మెన్, కెమెరామెన్, దర్శకుడితో పాటు.. ఓ కాంపౌండర్, డాక్టర్ కూడా కనిపించే రోజులొచ్చేశాయి. ఇటీవల రజినీకాంత్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయనకు కారవ్యాన్ తోపాటు, ఓ చిన్న అంబులెన్స్ కూడా రెడీ చేసి పెట్టారు.
ఓసారి సినిమా షూటింగ్ స్పాట్ లోనే రజినీ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడటంతో.. షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన వ్యక్తిగత డాక్టర్ ను షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయనతోపాటే లొకేషన్ కి పంపించారు. అన్నాత్తై లొకేషన్ ఓ మినీ ఐసీయూను తలపించింది.
మహేష్ బాబు కూడా తన కొత్త సినిమా సర్కారువారి పాట సినిమా షూటింగ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకోబోతున్నాడు. జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఆ సమయానికి షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయించాలనేది మహేష్ బాబు ఆలోచన.
కనీసం షూటింగ్ స్పాట్ లో అయినా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేసి, సెట్లోకి వచ్చినవారికి వచ్చినట్టు టీకా ఇప్పించాలని దర్శక నిర్మాతలకు సూచించాడట. మహేష్ బాబు ఒక్కరే కాదు, దాదాపుగా స్టార్ హీరోలంతా ముందుగానే తమ టీమ్ కి వ్యాక్సినేషన్ చేయించాలని, ఆ బాధ్యత నిర్మాతలు తీసుకోవాలని చెప్పారట. దీంతో పాటు ఓ మెడికల్ టీమ్ ను కూడా అందుబాటులో ఉంచేలా కండిషన్లు పెడుతున్నారు.
దాదాపుగా ఇకపై జరగబోయే ప్రతి షూటింగ్ స్పాట్ లో వైద్యులు అందుబాటులో ఉండాల్సిందే. అది వ్యాక్సినేషన్ కోసమైనా, లేదా ఇంకేదైనా అవసరానికైనా.. డాక్టర్, కాంపౌండర్ ని కచ్చితంగా లొకేషన్ కి పిలిపించుకోవాలనుకుంటున్నారు హీరోలు.
సెకండ్ వేవ్ తర్వాత మొదలయ్యే ప్రతి సినిమా షూటింగ్ లో ఇలాంటి సీన్లు కామన్ గా కనిపించే అవకాశం ఉంది. కరోనాతో కలసి ఉండాలే తప్ప దాన్ని వదిలించుకోవడం కష్టమని సెకండ్ వేవ్ గట్టిగానే గుణపాఠం చెప్పింది. అందుకే ఈ మార్పులు చేర్పులన్నీ.