భీమ‌వరం వ‌చ్చుంటే…అదే చివ‌రి రోజు అయ్యేది!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై టీడీపీ నుంచి సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆయ‌న ప్రాణాల‌పై ఆ పార్టీ తీవ్ర ఆందోళ‌న చెందుతోంది. ర‌ఘురామకృష్ణంరాజు భీమ‌వ‌రం వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిదైంద‌ని టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌వేళ భీమ‌వ‌రం వెళ్లి…

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై టీడీపీ నుంచి సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆయ‌న ప్రాణాల‌పై ఆ పార్టీ తీవ్ర ఆందోళ‌న చెందుతోంది. ర‌ఘురామకృష్ణంరాజు భీమ‌వ‌రం వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిదైంద‌ని టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌వేళ భీమ‌వ‌రం వెళ్లి వుంటే…కీడు జ‌రిగి వుండేద‌ని టీడీపీ అనుమానిస్తోంది. టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ ర‌ఘురామ ప్రాణాల‌తో ఆందోళ‌న చెంద‌డం గ‌మ‌నార్హం.

ఉమా మాట్లాడుతూ ర‌ఘురామ‌కృష్ణంరాజును హ‌త్య చేయ‌డానికి అధికార పార్టీ ప్లాన్ చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. న‌ర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎంపీ ర‌ఘురామ భీమ‌వ‌రం వ‌చ్చుంటే ….ఆయ‌న‌కు అదే చివ‌రి రోజు అయ్యేద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం. రైలులో ఉండ‌గా దాడి చేస్తార‌నే స‌మాచారం రాగానే ర‌ఘురామ బేగంపేట‌లో దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నార‌ని చెప్పుకొచ్చారు.

త‌న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని వైసీపీ అంటే.. సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు తెలుస్తాయని ఆయ‌న అన్నారు. ప్రధాని మోదీ ఏపీ వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారంటే.. జగన్ పాలన ఎలా ఉందో అర్థమైందన్నారు. సత్తెనపల్లిలో 100 మంది గుండాలతో రఘురామ ప్రయాణిస్తున్న బోగిని తగలపెట్టి చంపాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సత్తనపల్లి రైల్వే స్టేషన్ పుటేజ్‌ని బయట పెట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

ర‌ఘురామ బోగిలో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు ప్ర‌ముఖులు అర్ధాంత‌రంగా దిగిపోయార‌ని ఆరోపించ‌డం, అలాగే తాజాగా స‌త్తెన‌ప‌ల్లిలో ఏకంగా 100 మంది గూండాలు రెడీగా ఉన్నార‌ని ఎల్లో బ్యాచ్ ఆరోపిస్తున్న‌దంటే… ఇదేదో వారే ప్లాన్ చేసిన‌ట్టుగా వుంద‌ని అధికార ప‌క్షం నుంచి విమ‌ర్శ‌లొస్తున్నాయి. అధికార పార్టీ లేక ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లను ప‌క్క‌న పెడితే… ర‌ఘురామ‌ను ఏదో ఒక‌టి చేసి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌నే కుట్ర‌ల‌కు తెర‌లేచిన‌ట్టు అనుమానించ‌క త‌ప్ప‌దు.

ఈ నేప‌థ్యంలో అధికార పార్టీనే చొర‌వ తీసుకుని ర‌ఘురామ ప్రాణాల‌ను కాపాడాల్సి వుంది. ఎందుకంటే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో ర‌ఘురామ‌ను అదృశ్య శ‌క్తులు రాజ‌కీయ స్వార్థానికి వాడుకునే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఆ కోణంలోనైనా ఆలోచించి ర‌ఘురామ‌ను కాపాడుకునే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం తీసుకుంటే మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.