డేటా చోరీకి పాల్పడి తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధి పొందినట్టు స్పష్టత వచ్చినట్టు హౌజ్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఇవాళ భూమన నేతృత్వంలో హౌస్ కమిటీ సభ్యులు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్‌రావు, హోం, ఐటీశాఖల అధికారులు సమావేశమయ్యారు. పెగాసెస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కమిటీ చర్చించింది.
భూమన మాట్లాడుతూ 2016-2019 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేట్ భద్రతకు ముప్పు తెచ్చేలా ప్రవర్తించిందన్నారు. తమకు అనుకూలమైన వారి ఓట్లను ఉంచి, ప్రత్యర్థుల ఓట్లను తొలగించిందనే ఆరోపణలున్నాయన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు చర్యలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తమ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయన్నారు. ఉద్దేశ పూర్వకంగానే డేటా దొంగలించి రాజకీయంగా లబ్ధి పొందినట్టు స్పష్టత వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలో డేటా చోరీ జరిగిందని తెలంగాణ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిందని విమర్శించారు. అవసరమైతే విచారణ నిమిత్తం కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. త్వరలో నివేదికను అసెంబ్లీకి సమర్పిస్తామన్నారు.
డేటా చోరీకి సంబంధించి ఆధారాలను హౌస్ కమిటీ సేకరించడంపై కేసు ఆధారపడి వుంటుంది. కేవలం ఆరోపణలనే పరిగణలోకి తీసుకుని నివేదిక ఇస్తుందా లేక స్పష్టమైన ఆధారాలతో హౌస్ కమిటీ నివేదిక సంచలనం సృష్టిస్తుందా? అనే విషయమై ఉత్కంఠ నెలకుంది.
కానీ ఫోన్ ట్యాపింగ్, డేటా చోరీ, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు వెళ్లడమనేది చాలా సీరియస్ విషయం. దీన్ని భూమన నేతృత్వంలోని కమిటీ ఎలా ఛేదిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.