మా ఆదేశాలెందుకు అమ‌లు చేయ‌డం లేదు?

తెలంగాణ స‌ర్కార్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు మ‌రోసారి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. తామిచ్చిన ఆదేశాల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని హైకోర్టు నిగ్గ‌దీసింది. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్…

తెలంగాణ స‌ర్కార్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు మ‌రోసారి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. తామిచ్చిన ఆదేశాల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని హైకోర్టు నిగ్గ‌దీసింది. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ హిమా కోహ్లి, జ‌స్టిస్ విజ‌య‌సేన్‌రెడ్డి ధ‌ర్మాస‌నం విచారించింది. 

ఈ సంద‌ర్భంగా క‌రోనా క‌ట్ట‌డికి కేసీఆర్ స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ప్ర‌జారోగ్య సంచాల‌కులు (డీహెచ్‌) హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించారు. నివేదిక‌ను ప‌రిశీలించిన ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయ్యింది. 

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా? ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సల గరిష్ఠ ధరలను సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా? కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? కొత్త ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? అని కేసీఆర్ స‌ర్కార్ గుక్క తిప్పుకో లేని విధంగా ప్ర‌శ్న‌ల‌తో ముంచెత్తింది. తామిచ్చిన మ‌రికొన్ని ఆదేశాల‌ను అమ‌లు చేశారో లేదో నివేదిక‌లో పేర్కొన‌లేద‌ని హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం గుర్తు చేసింది. అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

నీలోఫర్‌ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా?. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారని, లైసెన్స్‌ రద్దుచేసిన ఆస్పత్రులకు బాధితులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చారా అని నిలదీసింది.

బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. డీహెచ్ ఖమ్మం వెళ్లినందున విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ న్యాయస్థానానికి తెలిపారు. 

హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. రేపు హెల్త్‌ సెక్రటరీ, డీహెచ్‌, డీజీపీలో హైకోర్టులో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ రేపటికి వాయిదా వేసింది.