నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద మందు ఆన్‌లైన్ మార్గం పట్టనుంది. ఈ మందుకున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందులోని శాస్త్రీయత పాలు ఎంత మాత్రమో తెలియదు కానీ, కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసే మందు బాగా పని చేస్తుందనే నమ్మకాన్ని మాత్రం సంపాదించుకుంది. దీంతో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా ఆనందయ్య మందుపై శరవేగంతో ప్రభుత్వం అధ్యయనం చేసి, పంపిణీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టు తయారీ, పంపిణీపై చర్చించేందుకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధరబాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి , ఆనందయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మందును ఆన్‌లైన్ పద్ధతిలో పంపిణీ చేసేందుకు కూడా నిర్ణయించారు.
ముఖ్యంగా మందు పంపిణీ సందర్భంగా పెద్ద ఎత్తున జనం గుమికూడకుండా కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. భారీగా మందు తయారు చేసేందుకు ముడిసరుకు సేకరించి నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్రారంభించనున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
వికేంద్రీకరణ, ఆన్‌లైన్ విధానం ద్వారానే మందు పంపిణీ జరుగుతుందని, నేరుగా ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ మందు కోసం రావొద్దని అధికారులు సూచించారు. అవసరమైన ప్రాంతాలకు తామే మందు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సూచించిన ప్రాంతంలో మందు తయారీ చేపడతామన్నారు. కృష్ణపట్నంలో మందు తయారీ ఓ సెంటిమెంట్‌గా ఆనందయ్య ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. మందు పంపిణీ ప్రక్రియ చేపడితే తప్ప, ప్రజల డిమాండ్‌కు తగ్గట్టు ఇబ్బంది లేకుండా ఎలా చేరవేస్తారనే ఉత్కంఠకు తెరపడే అవకాశం లేదు.