బీజేపీకి మద్దతు విషయంలో దాపరికం లేదని వైసీపీ ఏలూరు ఎంపీ శ్రీధర్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఇవాళ తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్తమాన రాజకీయాలపై మనసులో మాట చెప్పారు. మూడేళ్లుగా బీజేపీకి మద్దతు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇందులో దాపరికం ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తుండడం వల్లే రాష్ట్రానికి సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాను తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.
బీజేపీకి వైసీపీని దూరం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సాయం అందకుండా చేయాలనే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తూనే వున్నాయి. అయితే వైసీపీకి అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లు ఉండడంతో బీజేపీ దూరం చేసుకునే పరిస్థితి లేదు. మరోవైపు చంద్రబాబు అవకాశవాద రాజకీయానికి ఏపీలో తమ పార్టీ బలైందని బీజేపీ నేతల భావన.
వైసీపీని బీజేపీకి దూరం చేయడానికే పవన్ ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. బీజేపీతో వైసీపీ సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపిస్తూ, మైనార్టీలను దూరం చేయడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ఎంపీ శ్రీధర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.