నరేష్, పవిత్రా లోకేశ్ ఇద్దరూ సెలబ్రిటీలు. వాళ్ల జీవితం మీద జనాలకి ఆసక్తి. అక్కడి వరకూ OK కానీ, వాళ్లిద్దరి మీద చర్చలు, తీర్పులు చేసే హక్కు ఎవరికైనా వుంటుందా? టీవీ, యూట్యూబ్ చానళ్లు అంటే వ్యక్తులకి నీతి పాఠాలు చెప్పే మోరల్ పోలీసులా?
విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే చట్టపరంగా నేరం. రమ్యతో నరేష్ విడాకులు తీసుకోలేదు. భర్తతో పవిత్ర కూడా తీసుకోలేదు. అలాగని వాళ్లు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. అంటే చట్టపరంగా వాళ్లు ఏ నేరమూ చేయలేదు.
నరేష్‌తో సమస్య వుంటే రమ్య ఫిర్యాదు చేసుకోవచ్చు. అదే విధంగా పవిత్ర కూడా అంతే. ఏ విధంగా చూసినా ఇది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత సమస్య. జనాలకి ఏ రకంగా సంబంధం లేదు. వాళ్లు సినిమా నటులు. డబ్బు కోసం యాక్ట్ చేస్తారంతే. వాళ్ల బతుకు వాళ్లు బతుకుతున్నారు తప్ప, సమాజానికి నీతిశాస్త్రాలు బోధించడం లేదు. మరి వాళ్ల జీవితాల్ని రచ్చకెక్కించే హక్కు మీడియాకి వుందా?
వాళ్లు మైసూరులో వుంటే రమ్య నిఘా వేస్తే అది ఆమె సమస్య. పిలిచింది కదా అని కెమెరాలు ఎత్తుకుని వీళ్లు పరిగెత్తారు. రేటింగ్ వీళ్ల సమస్య. ఇపుడున్న పోటీలో జనానికి కావాల్సింది ఇదే అనుకున్నా హోటల్ సీన్‌తో ఆపేశారా అంటే అదీ లేదు. కెమెరా తీసుకుని నరేష్ ఇంటికెళ్లి ఇది విజయకృష్ణ టవర్స్, ఆయన వుండేది ఇక్కడే అని ఒకరు, యూట్యూబ్ చానళ్లు చర్చల పేరిట ఇంకొకరు దీన్ని ఓ జాతీయ సమస్యగా చూపించడం అవసరమా?
ఒక చానల్‌లో మానసిక శాస్త్రవేత్తను పిలిపించారు. నరేష్ ఎపిసోడ్ వివరిస్తూ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నంపై సుదీర్ఘ వివరణ. ఇంకో యూట్యూబ్ చానల్‌లో కుటుంబం, సామాజిక సంబంధాలపై చర్చ. రేటింగ్‌లో వెనుకబడి పోతామని, నైతికంగా పాతాళంలోకి వెళుతున్నారు. నరేష్, పవిత్రలది ఏ తప్పు లేదు. వాళ్ల వ్యక్తిగత కారణాలతో రిలేషన్‌షిప్‌లో వుండొచ్చు, వుండకపోవచ్చు. అది వాళ్లిష్టం. వాళ్ల జీవితాల్లో దూరే హక్కు మీడియాకి ఎక్కడిది?
వ్యక్తిగత జీవితాల్లో చొరబడి డయానాని మీడియా చంపేసింది. అదే మీడియా డయానాని దాటుకుని అందరి మధ్యకి వచ్చేసి మోరల్ పోలీస్‌లా తీర్పులు ఇచ్చేస్తూ వుంది. సెలబ్రిటీలే కాదు, సామాన్యుల్ని కూడా వదలడం లేదు. ఈ మధ్య ఒక మహిళా పోలీస్ అధికారిని ఇలాగే రచ్చకీడ్చారు. ఆమెకి, భర్తకి విభేదాలుంటే దాంతో మీడియాకేం పని? దాన్ని చూసి రేటింగ్‌లు ఇస్తున్న… సమాజం పరిస్థితి ఏమిటి? నీతి లేనిది ఎవరికి?