అల్లూరి సీతారామరాజు గురించి చిన్నప్పుడు స్కూల్‌లో చదివాం. అప్పుడప్పుడు బుర్రకథల ద్వారా విన్నాం. స్కూల్ ఫంక్షన్లలో ఏకపాత్రాభినయం చూశాం. అంతే తప్ప ఆయన జీవితం , పోరాటం, మరణం గురించి పూర్తిగా తెలియదు. సినిమా పవర్‌ఫుల్ మీడియం. మనం ఎన్ని పుస్తకాలు చదివినా రామరాజు రూపం ఒక ఊహ మాత్రమే. సినిమా అలా కాదు, మనిషి కళ్ల ముందు కనిపిస్తాడు. సీతారామరాజుని కళ్ల ముందు నిలిపినవాడు సూపర్‌స్టార్ కృష్ణ.
సినిమా ఒక వ్యాపారమే కావచ్చు. కానీ అల్లూరి సీతారామరాజుని ఒక చిత్తశుద్ధితో, దీక్షతో నిర్మించాడు కృష్ణ. ఫలితంగా సీతారామరాజు పేరు చెబితే కృష్ణే గుర్తుకొస్తాడు. రామరాజు చరిత్రని అంత బలంగా తీసుకెళ్లిన వాడు కృష్ణ.
సీతారామరాజు విగ్రహావిష్కరణ తెలుగు వాళ్లకి గర్వకారణం. ఆయన పేద ప్రజల వీరుడు. దిక్కుమొక్కూ లేని గిరిజనుల కోసం పోరాడాడు. ఆ సభ ప్రధాని మోదీ, సీఎం జగన్ చేతుల మీదుగా జరగడం మన్యం వీరుడికి గౌరవం. కారణాలు ఏవైతేనేం చిరంజీవి కూడా వచ్చాడు. చిరంజీవి గొప్ప నటుడు. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. మోదీ సభలో గౌరవం పొందడానికి అర్హుడు. ఒక హీరోగా, రాజకీయ నాయకుడిగా, మాజీ మంత్రిగా తెలుగు వీరుడి సభలో చిరంజీవి ఉండడం ఒక గౌరవం, మర్యాద. ఆయన గొప్పదనం కూడా.
అయితే ఇంత పెద్ద సభలో కృష్ణ లేడు. లోపం ఎక్కడుందో తెలియదు. కృష్ణని మరిచిపోయారో, అవసరం లేదనుకున్నారో తెలియదు. సీతారామరాజును తెలుగు వాళ్లకి మరింత చేరువ చేసి , వాళ్ల గుండెల్లో ఒక వీరుడి ముద్రకి కారణమైన కృష్ణని ఆ సభలో గౌరవిస్తే ఎంత బాగుండేది. ఈ వయసులో కృష్ణ పదవులు కోరుకుంటాడా? పారితోషికాలు కోరుకుంటాడా? కాసింత గౌరవమే కదా!
భాషని, సంస్కృతిని, వ్యక్తుల్ని గౌరవించడంలో తమిళులని చూసి మనం నేర్చుకోవాలి. తమిళ ప్రయోజనాలు, తమిళుల గౌరవం విషయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక మాట మీద వుంటారు.
తమను తాము తక్కువ చేసుకోవడంలో తెలుగు వాళ్లకి ఎవరూ సాటిరారు.
జీఆర్ మహర్షి