జ‌గ‌న్ బెయిల్‌పై సీబీఐ షాకింగ్ కౌంట‌ర్‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు సంబంధించి సీబీఐ షాకింగ్ కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కేసులో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రి ఏంటో తేల్చాల‌ని భావించి ర‌ఘురామ‌తో బెయిల్ పిటిష‌న్…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు సంబంధించి సీబీఐ షాకింగ్ కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కేసులో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రి ఏంటో తేల్చాల‌ని భావించి ర‌ఘురామ‌తో బెయిల్ పిటిష‌న్ వేయించారో, వారికి సీబీఐ తాజా కౌంట‌ర్ గ‌ట్టి ఎదురు దెబ్బ అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా జ‌గ‌న్ బెయిల్‌పై ఉత్కంఠ నెల‌కుంది.

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై మంగ‌ళ‌వారం సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. అంత‌కు ముందు కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు సీబీఐ మూడుసార్లు గ‌డువు కోర‌డం తెలిసిందే. చివ‌రి సారిగా గ‌త నెల సీబీఐ కోర్టు వార్నింగ్ ఇచ్చిన నేప‌థ్యంలో నేడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, సీబీఐ త‌మ వాద‌న‌కు సంబంధించి వేర్వురుగా కౌంట‌ర్ అఫిడ‌విట్లు దాఖ‌లు చేశారు.

బెయిల్‌ షరతులను జగన్‌ ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్‌ వాదనలో నిజం లేదని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు గ‌ట్టిగా వాదించారు. కేంద్ర హోంశాఖ పరిధిలో సీబీఐ  పనిచేస్తుందని, రఘురామరాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. అస‌లు ఇలాంటి కేసుల్లో థర్డ్‌ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయవాదులు గుర్తు చేశారు.

మ‌రోవైపు జ‌గ‌న్ బెయిల్ విష‌యంలో సీబీఐ కౌంట‌ర్ అఫిడ‌విట్‌పై అంద‌రి దృష్టి పడింది. ఎందుకంటే జ‌గ‌న్ కేసులో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రి ఏంట‌నేది సీబీఐ దాఖ‌లు చేసే కౌంట‌ర్ అఫిడ‌విట్‌తో తేలుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఉత్కంఠ‌గా ఎదురు చూశాయి. ఎట్టకేల‌కు సీబీఐ కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసి ఉత్కంఠ‌కు తెర‌దింపింది. చాలా తెలివిగా, వ్యూహాత్మ‌కంగా కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జ‌గ‌న్ బెయిల్ అంశాన్ని సీబీఐ కోర్టు బంతిలో వేసి, తాను త‌ప్పించుకుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌నే ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్ మెరిట్స్ ఆధారంగా గౌర‌వ కోర్టు నిర్ణ‌యం తీసుకోవాల‌ని సీబీఐ అఫిడ విట్‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతే త‌ప్ప‌, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని , నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నార‌నే అంశాల‌ను ప్ర‌స్తావించక‌పోవ‌డం విశేషం. జ‌గన్ బెయిల్ ర‌ద్దు చేయాల‌నే ఉత్సాహం, కోరిక సీబీఐ కోర్టుకు ఎందుకుంటాయ‌ని న్యాయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సీబీఐని, కేంద్రాన్ని బోనులో నిల‌బెట్టాల‌నే క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. అలాగే సీబీఐ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే నేప‌థ్యంలోనే కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసేందుకు స‌మ‌యం తీసుకుంద‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విచార‌ణ అనంత‌రం కేసును ఈ నెల 14కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.