రాష్ట్రంలో అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లాకు అన్ని రకాలుగా అన్యాయమే జరిగింది. ఈ విషయం అంతా ఒప్పుకుని తీరాల్సిందే. రాష్ట్రంలో వైద్య కళాశాల లేని ఏకైక జిల్లాగా విజయనగరం ఇప్పటిదాకా ఉంది.
మాకూ ఒక వైద్య కళాశాల అంటూ ఎన్నో పోరాటాలు ప్రజా సంఘాల ఆద్వర్యంలో జరిగాయి. ఈ దశాబ్దాల నాటి డిమాండ్ కు కదలిక వచ్చి నాటి సీఎం వైఎస్సార్ జీవో జారీ చేశారు. నిజానికి ఆయన హయాంలోనే కళాశాల వచ్చునేమో కానీ హఠాత్తుగా ఈ వైస్సార్ లోకం వీడారు.
ఇక తెలుగుదేశం ఏలుబడిలో విజయనగరం జిల్లాకు చంద్రబాబు భారీగానే హామీలు ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఇక నాడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు అయితే మాన్సాస్ ఆద్వర్యంలో తానే వైద్య కళాశాల నిర్మిస్తానని చెప్పారు. కానీ ఆయన సైతం చివరకు చేతులెత్తేశారు.
మొత్తానికి జగన్ సీఎం అయ్యాకనే విజయనగరానికి మెడికల్ కాలేజ్ మంజూరు అయింది అని అంతా ఇపుడు సంతోషిస్తున్నారు. తండ్రి జీవో ఇస్తే తనయుడు ఏకంగా కాలేజ్ ఇచ్చేశారని జిల్లా జనం సంతోషిస్తున్నారు. ఇక వామపక్ష నాయకులు సైతం జగన్ సర్కార్ ఇన్నాళ్ళకు తమ కలను తీర్చిందని, పోరాటాలకు ఫలితం దక్కిందని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.