‘అసలే ముక్కిడి.. ఆపై పడిశం’ అన్న సామెత లాగా తయారవుతున్న పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారం. పవన్ కల్యాణ్ సభల్లో ఎన్ని తప్పట్లు మోగినా.. ఆయనకు పడుతున్న ఓట్లు అంతంత మాత్రమే. కార్యక్రమాల్లో జనం కనిపించినా.. నిర్దిష్టంగా ఒక్కో ఊరిలో కార్యకర్తల రూపంలో కనిపిస్తున్న వారి సంఖ్య బాగా పరిమితమే.
ఇలాంటి నేపథ్యంలో.. ప్రజలకు పవన్ కల్యాణ్ మీద అంతో ఇంతో నమ్మకం ఉంటే గనుక దానిని కూడా నాశనం చేసే మాటలు వినిపిస్తే ఎలాగ? ఏదో ప్రత్యర్థులు అలాంటి మాటలు మాట్లాడితే.. తోసి పారేయొచ్చు. స్వయంగా పవన్ కల్యాణ్ కూడా తన ఆదరణను తానే పాతిపెట్టేసేలా.. డైలాగులు వల్లిస్తే ఆ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇప్పుడు ప్రజలకు అదే సందేహం కలుగుతోంది. అందుకే.. తాజాగా విజయవాడ లో ఆయన ప్రసంగానికి స్క్రిప్టు రాసిన వాడు ఎవడ్రా బాబూ.. అని వాళ్లు ఆలోచిస్తున్నారు! పవన్ మాటలు యథాతథంగా ప్రజలు అర్థం చేసుకుంటే గనుక.. ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా సున్న సీట్లకు పరిమితం కావాల్సిందేనని, పవన్ భుజాల మీద ఎక్కి సవారీ చేయాలనుకుంటున్న తెలుగుదేశానికి కూడా పుట్టి మునుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.
ఇంతకూ పవన్ ప్రసంగంలో ఏం చెప్పారో తెలుసా..
‘‘నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు.. నేనేం సీఎంను కాదు.. మీ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మాత్రమే చేస్తా.. అలా మా ద్వారా మీ సమస్య మరికొందరికి తెలుస్తుంది.. పరిష్కారం రాదు.. ఆ దిశగా కృషి చేస్తాం..’’ అని మాత్రమే పవన్ చెప్పారు.
ఈ రోజుల్లో మీ సమస్యల్ని చిటికెలో తీర్చేస్తా అని చెబుతున్న నాయకులకే ప్రజల్లో దిక్కులేదు. అలాంటిది మీ అర్జీల్ని నా చేతికి ఇచ్చి వెళ్లండి.. నేను కొరియర్ బాయ్ లాగా వాళ్ల చేతికి ఇస్తా.. అంతే తప్ప సమస్య తీరడం గురించి నన్ను అడగొద్దు.. అని పవన్ కల్యాణ్ లాగా చెబితే ఇక జనం ఏమాత్రం పట్టించుకుంటారు. ఆ మాత్రం దానికి ఈ సంబడమంతా ఎందుకని ఛీత్కరించుకుని చక్కాపోతారు!
కానీ.. జనవాణి కార్యక్రమం ప్రకటించిన ప్రెస్ నోట్ లో ఏం చెప్పారో తెలుసా..?
‘‘రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమస్య విన్నవించుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. దాన్ని బలపరిచే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.’’
ఈ వాక్యాలకు అర్థం ఏమిటి?
జనవాణి ప్రకటించినప్పుడేమో.. పవన్ కు చెప్పుకుంటే సమస్య తీరిపోతుంది, న్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. తీరా జనం వచ్చి అర్జీలు ఇస్తే.. నేనేమీ అద్భుతాలు చేయలేను.. నానుంచి ఎక్కువ ఆశించొద్దు అంటూ పవన్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఇలా తలా తోకాలేని మాటలు, ముందూ వెనుకా చూసుకోని కార్యక్రమాలతో పవన్ ఆ పార్టీని ఎక్కడకు తీసుకెళ్తారో ఏమిటో?