నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును కొట్టాలనో, కొట్టించాలనో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులకు ఎంత కోపం వుందో తెలియదు. కానీ రఘురామను కొట్టించే వరకూ ఎల్లో టీం మాత్రం నిద్రపోయేలా లేదు. అప్పుడెప్పుడో హైదరాబాద్ నుంచి రఘురామను సీఐడీ అధికారులు విజయవాడ తీసుకెళ్లి చితకబాదారని బాధితుడు చక్కటి ఆహభావాలతో చెబితే విన్నాం. తనను కుక్క కంటే హీనంగా కొట్టారని రఘురామ ఆవేదనతో చెబితే కొందరు అయ్యో అని బాధపడితే, మరికొందరు తిక్క కుదిరిందిలే అని సంబరపడ్డారు.
తాజాగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ, జయంతి వేడుకలకు వెళ్లాలని ఆయన భావించారు. ఆహ్వానమే లేని వేడుకకు వెళ్తానంటూ న్యాయపోరాటం చేశారు. భీమవరం వెళ్తున్నా అంటూ రైలు ఎక్కి బిల్డప్ ఇచ్చారు. హైదరాబాద్ నగరం దాటితే ఏమవుతుందోననే భయంతో మధ్యలో స్టేషన్ రాగానే దిగి… హమ్మయ్య బతికిపోయానని ఊపిరి పీల్చుకున్నారు. రఘురామ ఉత్త పిరికోడే అని సొంతవాళ్లు కూడా తిట్టేలా చేసుకున్నారు.
ఇక జనానికి వినోదం పంచేందుకు, అలాగే టైం పాస్ చేసేందుకు ఆస్థాన చానల్‌కు వెళ్లారాయన. ఆ చానల్‌లో రాజకీయ విశ్లేషకుడు, రిటైర్ న్యాయమూర్తి వ్యూహాత్మకంగా రఘురామను పొగుడుతూ, జగన్ ప్రభుత్వాన్ని తిడుతూ మనసులో మాటను బయట పెట్టారు. ఆయన గారి మాటలు వింటే మాత్రం… ఇంతకూ రఘురామను కొట్టాలని బలంగా కోరుకుంటున్నదెవరో వీక్షకులు సులువుగా పసిగట్టి వుంటారు. ఆయన ఏమంటారంటే…
“ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే సంవత్సరం తర్వాతైనా రఘురామకృష్ణంరాజు ఈ పరిస్థితిని ఎదుర్కోవల్సిందే. రఘురామకృష్ణంరాజు పురిటి నొప్పులు పడందే కాన్పు కాదు. రఘురామకృష్ణంరాజుపై జరుగుతున్న మానసిక, దౌర్భాగ్య, రాజకీయ, సామాజిక దాడిలో నుంచి ఆయన బయటికి రావాలంటే ఒకరోజు ఆయన ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి. ఏమవుతుంది? చంపేస్తారా? లేకపోతే మన బంధువుల్ని చంపేస్తారా? లేకపోతే రైలు పెట్టెల్ని తగలబెడతారా? లేకపోతే కాళ్లుచేతులు విరగ్గొట్టి జైళ్లో పెట్టేస్తారా? చేయనివ్వండి.
కాపాడ్డానికి రాజ్యాంగం ఒకటుంది రఘురామకృష్ణంరాజు. రఘురామకృష్ణంరాజు భీమవరం రావాల్సి వుండింది. ఏం జరిగినా ప్రజలు నిర్ణయం తీసుకునేవాళ్లు. ఒక మంచి అవకాశాన్ని మీరు చేజార్చుకున్నారని విశ్లేషించగలను” అని ముక్తాయింపు ఇచ్చారు. రఘురామకృష్ణంరాజుకు లైవ్‌లో సదరు న్యాయనిపుణుడు, రాజకీయ విశ్లేషకుడు చెప్పిన సంగతి ఇది.
కోడి పందేల సమయంలో దెబ్బతిన్న పుంజుకోడికి శక్తి వచ్చేందుకు డమ్ము కొడుతుంటారు. ఆ రీతిలో నర్సాపురం పందెం కోడికి ఎల్లో బ్యాచ్ డమ్ము కొడుతూ, జగన్‌పై నేరుగా యుద్ధానికి ఉసిగొల్పుతోంది. అయితే రఘురామకు ఏం చేయాలో దిక్కుతోచలేదు.
ఒకసారి సీఐడీ చేతిలో సత్కారానికే ఆయన జీవితాంతం భయపడుతున్నారు. మళ్లీమళ్లీ సత్కారాలు పొందాలంటే ఆయన భయపకుండా, ఉత్సాహంగా వెళ్తారా? అరెస్ట్ చేస్తే, పోలీసులు కొడితే న్యాయస్థానం ద్వారా శిక్ష పడేలా చేయొచ్చు. కానీ జనంతో కొట్టిస్తే ఎవరు బాధ్యత వహిస్తారండి?
అందరూ ధైర్యం నూరిపోసే వాళ్లే. క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే వాళ్లకు తెలుస్తుంది భయం అంటే ఏంటో! ఆ మాత్రం రఘురామకు తెలియదా? రఘురామపై ప్రేమ వుంటే… పోయి చావోరేవో తేల్చుకో అని ఎవరైనా ఉచిత సలహా ఇస్తారా? చివరికి జగన్‌ను బద్నాం చేయడానికి రఘురామను బలిపెట్టేలా ఉన్నారని ఆయనకు ఇస్తున్న ఉచిత సలహాలే నిదర్శనం. ఇంతకూ తనను కొట్టించాలని ఎల్లో గ్యాంగ్ పరితపిస్తోందని రఘురామకు అర్థమవుతోందా?
సొదుం రమణ