అల్లరికి ప్రచారం ఎక్కువ. చిల్లర చేష్టలు చేసే రాజకీయ నాయకులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. మీడియాకి సెన్సేషన్ తప్ప మరేది పట్టదు. రెండు మంచి మాటలు చెబితే వినేవాళ్లు కరువయ్యారు. కానీ బూతుపురాణం వినేవాళ్లు ఎక్కువ. రెండు మూడురోజులుగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలుస్తున్నారంటే, ఆయన కథాకమామీషూ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
భీమవరం వెళ్లడానికి ఆయనకు ఆహ్వానమే లేదు. అయినప్పటికీ హంగామా. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజుకు ప్రొటోకాల్ విషయమై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెంప ఛెళ్లుమనే సమాధానం ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా కిషన్‌రెడ్డిని అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తారు. అందుకే ఆయన మాటకు అంత విలువ.
భీమవరంలో ప్రధాని మోదీ బహిరంగ సభ ముగిసిన తర్వాత కిషన్‌రెడ్డి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వేడుకలకు పలువురు ప్రముఖులను ఆహ్వానించామన్నారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా హాజరు కాలేకపోయారన్నారు.
ఇదే సందర్భంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సంబంధించి ప్రొటోకాల్ విషయంలో పొరపాటు జరిగినందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. అచ్చెన్న బాధ పడి వుంటే క్షమాపణ కోరుతున్నానన్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.
ప్రజల్లో మమేకం అయ్యేందుకు ఈ వేడుకలను నిర్వహించామన్నారు. అంతేగానీ, రాజకీయాలను పరిష్కరించేందుకు కాదని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. అచ్చెన్నకు మాత్రం క్షమాపణ చెప్పిన కిషన్‌రెడ్డి, రఘురామ విషయానికి వచ్చే సరికి… ఆ మర్యాద పాటించాల్సిన వ్యక్తి కాదన్నట్టుగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా కిషన్‌రెడ్డి సమాధానంతో తన స్థానం ఏంటో రఘురామ అర్థం చేసుకుంటారా?