సినిమా జర్నలిస్ట్ ల్లో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అనదగ్గ గుడిపూడి శ్రీహరి ఈ రోజు మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. సినిమా సమీక్షను సామాన్యుడికి చేరువ చేసిన జర్నలిస్ట్ గా గుడిపూడి శ్రీహరిని చెప్పుకోవచ్చు.
చిరకాలం పాటు సితార సినిమా పత్రికలో నిశితమైన, సవివరమైన సమీక్షలు రాసారు. ఆయన సమీక్షల కోసం అప్పట్లో పాఠకులు ఆతృతగా ఎదురు చూసేవారు. కేవలం విమర్శించడం కాకుండా, లోటు పాట్లను సవివరంగా అక్షరబద్దం చేసేవారు.సినిమా తప్పు ఒప్పులు కళ్లకు కట్టినట్లు వివరించేవారు. దాదాపు 55 ఏళ్లపాటు పాత్రికేయవృత్తిలో వున్నారు. సితారలో సమీక్షలు, ఈనాడులో హరివిల్లు కాలమ్ తో ఆయన చాలా ప్రసిద్దులయ్యారు.
హిందూ పత్రిక కంట్రిబ్యూటర్ గా 1968లో ఆయన కెరీర్ ప్రారంభించారు. తరువాత ఈనాడు కు రాయడం ప్రారంభించారు. అలాగే ఆల్ ఇండియా రేడియో కి న్యూస్ బ్రాడ్ కాస్టర్ గా పనిచేసారు. కేవలం సినిమాల గురించే కాకుండా వివిధ కళాకారులు, కళారూపాల గురించి కూడా ఆయన పలు వ్యాసాలు రాశారు. పలువురు కళాకారులను వెలుగులోకి తెచ్చారు. పలు కళాబృందాలకు అవకాశాలు దొిరకేలా చేసారు.
కొంత కాలం పాటు గ్రేట్ ఆంధ్ర లో కూడా సమీక్షలు రాసారు. సినిమా వార్తలు అందించారు. గుడిపూడి శ్రీహరికి కొడుకు, కూతరు వున్నారు.