ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరపతిని ఆయన శత్రు మీడియా పెంచుతోంది. సీఎం సొంత మీడియా చేయని పనిని ప్రత్యర్థి మీడియా చేస్తుండడం విశేషం. అయితే జగన్‌పై అక్కసుతో రాస్తున్నప్పటికీ, అందులో అనివార్యంగా జగన్ పలుకుబడిని అమాంతం పెంచక తప్పడం లేదు. కేంద్రంలో జగన్ మాటకే విలువ ఉందని మరోసారి ఎల్లో పత్రిక కథనం రాయకతప్పని సరి పరిస్థితి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే దుష్టచతుష్టయంగా కొన్ని మీడియా సంస్థల్ని పేరుపేరునా తిడుతున్న సంగతి తెలిసిందే. ఆ దుష్టచతుష్టయంలోని ఓ పత్రిక జగన్ పలుకుబడిపై ఈర్ష్యతో రాసినప్పటికీ, అది ఆయనకు అనుకూల వాతావరణాన్ని సృష్టిం చడం విశేషం. భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ రావడం ద్వారా ప్రాధాన్యం పెరిగింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దన్న వాళ్ల పేర్లని ప్రొటోకాల్ జాబితా నుంచి తొలగించారని సదరు జగన్ వ్యతిరేక పత్రిక రాయడం విశేషం. అంతేకాదు, జగన్ ఒత్తిడికి కేంద్రం లొంగిపోయిందని రాయడం ద్వారా ముఖ్యమంత్రి పరపతిని పెంచడమే అని చెబుతున్నారు. జగన్ దుష్టచతుష్టయంగా అభివర్ణించే మీడియాకు సంబంధించి ఆ పత్రిక ఏం రాసిందంటే..
‘స్థానిక ఎంపీ హోదాలో రఘురామకృష్ణంరాజు ప్రధాని సభకు అధ్యక్షత వహించాలి. కానీ… ప్రధాని కార్యాలయం (పీఎంవో) పంపిన ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరే లేదు! అలాగే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు చివరి నిమిషంలో మాయమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తొలుత ఆహ్వానమే అందలేదు. తర్వాత… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొక్కుబడిగా ఫోన్ చేసి పిలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిట్టని వారెవరికీ ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించలేదు. ‘వాళ్లను పిలవొద్దు’ అని జగన్ కోరారు! ‘తథాస్తు’ అంటూ బీజేపీ పెద్దలు అంగీకరించారు! ప్రధాని మోదీ పర్యటనలో రాష్ట్రం నుంచి ఎవరెవరు పాల్గొనాలనే అంశంపై జగన్ ఒత్తిడికి కేంద్రం లొంగిపోయింది. తాను పిలిచిన అతిథులను కూడా ఆయన ఒత్తిడితో ఆహ్వానితుల జాబితా నుంచి తొలగించింది’ అని సదరు పత్రిక రాసుకొచ్చింది.
ఆంధ్రాలో అడుగు పెట్టడానికే భయపడే రఘురామకృష్ణంరాజుకు కేంద్రం వద్ద చాలా పలుకుబడి ఉందని నిత్యం ఊదరగొట్టే మీడియానే… ఇవాళ ఆయనకు అంత సీన్ లేదని పరోక్షంగానైనా రాయకతప్పలేదు. వాళ్లను పిలవొద్దని జగన్ కోరారట, తథాస్తు అని బీజేపీ పెద్దలు అన్నారట. జగన్ చెప్పినట్టు కేంద్రం ఆడుతోందని ఈ కథనం ముఖ్యమంత్రిపై సానుకూల సంకేతాల్ని పంపింది. నచ్చని పత్రికలు అసూయతో రాసినా, ఆ రాతలు జగన్‌కు కీర్తి తీసుకొచ్చేలా వున్నాయి.
ఎల్లో మీడియా నుంచి ఇలాంటి కథనాలే జగన్‌కు కిక్ ఇస్తాయి. అందుకే ఆయన పదేపదే ఇలాంటి కథనాల్ని ఎల్లో మీడియా నుంచి కోరుకుంటుంటారు. జగన్ ఆశించినట్టే వాళ్లు చేస్తున్నారు. ప్రత్యర్థుల్ని దరిదాపుల్లోకి కూడా రాకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారనే సందేశాన్ని సదరు పత్రిక జనంలోకి తీసుకెళ్లింది. ఇలాంటి కథనాల్ని వైసీపీ ఆస్వాదిస్తోంది. దుష్టచతుష్టయం అని అంటారే గానీ, అది చేసే మంచిని జగన్ కాదనగలరా?
సొదుం రమణ