ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ప్రవేశం దక్కలేదు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు కేంద్ర పర్యాటకశాఖ నుంచి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో టీడీపీ తరపున అచ్చెన్నాయుడు భీమవరం వెళ్లారు.
హెలిప్యాడ్ వద్దకు రావాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆహ్వానించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే తనకిచ్చిన జాబితాలో అచ్చెన్న పేరు లేదని కలెక్టర్ తెలిపారు. దీంతో ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు రాకుండానే అచ్చెన్న ఆగిపోయారు.
పిలిచి అవమానించారని అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు వాపోతున్నారు. రాజకీయాలకు అతీతంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని కేంద్రపర్యాటక శాఖ ఆహ్వానిస్తే వచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కక్ష కట్టి అవమానించిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
జనసేన ప్రతినిధులు ఆహ్వానించినప్పటికీ వారి విషయంలో ఇలాంటి మాట వినిపించలేదు. మరి వాళ్లను హెలిప్యాడ్ వద్దకు ఆహ్వానించారో లేదో తెలియాల్సి వుంది.
బీజేపీ నేతలు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సభా వేదికపై ఆత్మీయంగా మాట్లాడుతూ కనిపించారు. కిషన్రెడ్డి, సోము వీర్రాజులతో జగన్ నవ్వుతో ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది.