మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇవాళ బల నిరూపణలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నెగ్గింది. విశ్వాస పరీక్షలో షిండే ప్రభుత్వానికి అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 99 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయగా, ముగ్గురు దూరంగా ఉన్నారు.
షిండే ప్రభుత్వంపై ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికలు రావచ్చని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో భవిష్యత్‌లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలపై ఆయన అంచనా వేశారు. ఈ సందర్భంగా తన పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేశారు. శరద్ పవార్ ఏమన్నారంటే…
“వచ్చే ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం కూలిపోవచ్చు. అందరూ మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. కొత్త ప్రభుత్వంలో షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. మంత్రిత్వశాఖలు కేటాయించిన తర్వాత వారి అసంతృప్తి బయటపడుతుంది. ఆ అసంతృప్తే ప్రభుత్వం కూలిపోయేందుకు దారి తీయొచ్చు” అని శరద్‌పవార్ తన పార్టీ నేతలు, కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
శరద్ పవార్ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెబుతున్న జోస్యాన్ని కొట్టి పారేయలేం. ప్రస్తుతం మహారాష్ట్రలో శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడమే నాయకుల ఎదుట ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం.