లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చున్న వాళ్లే చాలా విసుగెత్తిపోతూ ఉన్నారు. తమ జీవితాలు ఇలా అయిపోయాయేంటనేంత రేంజ్ లో వారు వాపోతూ ఉన్నారు. ఇంట్లో కరెంట్ ఉంది, తినడానికి తిండి ఉంది, అన్ని సదుపాయాలూ ఉన్నాయి. చేతిలో డబ్బుంది.. అయితే ఖర్చు పెట్టడానికి బయటకు వెళ్లడానికి అవకాశం లేదనే బాధే చాలా మందిది! అలా ఎవరైనా ఫీల్ అవుతుంటే.. టోటల్ లాక్ డౌన్ లో కొంతమంది సామాన్యులు పడుతున్న బాధలేంటో తెలుసుకోవాలి.
ఐదు రోజులుగా.. హౌరా రేల్వే స్టేషన్ లో చిక్కుకున్న వలస కూలీల దైన్యం గురించి తెలుసుకోవాలి. వారంతా పనుల కోసం కోల్ కతాకు వలస వెళ్లిన వాళ్లు. బిహార్, అస్సోం నుంచి కోల్ కతాకు వలస వెళ్లి అక్కడ చిన్నాచితక పనులు చేసుకొంటూ.. రోజు వారీ కూలీతో బతుకీడ్చేవాళ్లు.
అందరి జీవితాలనూ ప్రభావితం చేసినట్టుగానే కరోనా వారి జీవితాలనూ ప్రభావితం చేసింది. అయితే వీళ్లేమీ సకల సౌకర్యాలతో ఇళ్లళ్లో లాక్ డౌన్ అయిపోయి ఫీల్ అయిపోవడం లేదు. వీళ్లంతా రైల్వే స్టేషన్లో చిక్కుకున్నారు. సొంతూళ్లకు వెళ్లడానికి అని హౌరా స్టేషన్ చేరుకున్న వీళ్లు.. అక్కడ నుంచి రైళ్లు కదలకపోవడంతో.. అక్కడే ఆగిపోయారు.
పగలంతా అక్కడే, రాత్రంతా అక్కడే.. వాళ్లంతా దిన కూలీ పనులు చేసుకునే వాళ్లు, అలాంటి వారి చేతిలో ఉన్న డబ్బులు ఎంత మాత్రమే అంచనా వేయడం కష్టం కాదు. ఎటు వెళ్లడానికీ అవకాశం లేదు, మరోవైపు కరోనా భయం ఉండనే ఉంది. ఇలా హౌరా స్టేషన్లో అనేక మంది కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం ఇలాంటి వారి పరిస్థితి గురించి పట్టించుకోదా? ఇళ్లు ఉన్న వాళ్లను ఇళ్లలో పెట్టి లాక్ చేయొచ్చు. అయితే భారతదేశంలో రోడ్డు మీదే జీవితాలను గడిపేవారూ ఉన్నారు. వాళ్ల గురించి ఇలాంటి సమయంలో అయినా ప్రభుత్వాలు పట్టించుకోవా?