కోరి మరీ తిట్టించుకోవడానికి కొంతమంది సినిమా భామలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉన్నారు. తాము కూడా ఉన్నట్టుగా గుర్తించమన్నట్టుగా వీరు సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొందరు కావాలని నెటిజన్లను ఏదో విధంగా కెళుక్కొంటున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే కొంతమంది నిలిచారు. తీవ్రమైన ట్రోల్ ను ఎదుర్కొన్నారు. ఈ పరంపరలో విద్యాబాలన్ కూడా జాయిన్ అయ్యింది.
కెరీర్ మందగమనంలో సాగుతుండటంతో విద్యాబాలన్ వార్తలు బాగా తగ్గాయి. ఈ క్రమంలో కరోనా కు థ్యాంక్స్ అంటూ పోస్టు చేసి విద్యాబాలన్ వార్తల్లోకి వచ్చింది. అదేమంటే… జనాలు ఎక్కడిక్కడ ఉండిపోవడం, వాహనాలు రోడ్డెక్కపోవడం, ఇతర పనులన్నీ ఆగిపోవడంతో కాలుష్యం బాగా తగ్గిందని విద్య చెప్పుకొచ్చింది. గాలి ప్యూరిఫై అయ్యిందని.. ఇలాంటి వాతావరణం ఏర్పడటానికి కారణమైన కరోనాకు థ్యాంక్స్ అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.
బలిసిన పార్టీలు,కడుపు నిండిన పార్టీలు ఇలాంటి థియరీలు ఎన్ని అయినా చెప్పగలవు. వీళ్లకు నేచర్ మీద అపారమైన ప్రేమ! వీళ్లదేముంది.. మరో పదేళ్ల పాటు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయినా బతికేయగలరు. ఆ రేంజ్ లో సంపాదించుకుని ఉంటారు. అయితే ఇంత పెద్ద భారత దేశంలో ఏ రోజుకు ఆ రోజు సంపాదనతో బతుకీడ్చేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. అలాంటి వారి పరిస్థితి? మొత్తం లాక్ డౌన్ అయిపోయిన నేపథ్యంలో ఎంతో మంది సంపాదన లేక ఇక్కట్ల పాలవుతూ ఉంటారు. వారికి దుమ్మూధూళీ కాలుష్యాలు పట్టవు. ఎందుకంటే.. అన్నం ముఖ్యం కాబట్టి. విద్యాబాలన్ లాంటి వాళ్లు ఇలాంటి మెట్టవేదాంతాలు ఎన్నైనా చెప్పగలరు. ఇలాంటి మాటలు మాట్లాడి సగటు నెటిజన్లతో తిట్టించుకోనూ గలరు!