ఎమ్బీయస్ : ఎడ్మండ్ హిల్లరీ వ్యక్తిత్వం

మే 29న అంతర్జాతీయ ఎవరెస్టు దినంగా నేపాల్ ప్రకటించి, 2008 నుంచి జరుపుతోంది. 1953 మే 29నే ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్కే మొదటిసారిగా 8,849 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కారు. ఆ…

మే 29న అంతర్జాతీయ ఎవరెస్టు దినంగా నేపాల్ ప్రకటించి, 2008 నుంచి జరుపుతోంది. 1953 మే 29నే ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్కే మొదటిసారిగా 8,849 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కారు. ఆ యాత్రలో వాళ్లు పడిన శ్రమ గురించి పుస్తకాలు వచ్చాయి. ఈ వ్యాసం ఎడ్మండ్ హిల్లరీ యొక్క వ్యక్తిత్వం గురించి. తన 88వ ఏట 2008లో హిల్లరీ మరణించినపుడు ఫ్రంట్‌లైన్, తెహల్కాలలో వచ్చిన ఆర్టికల్స్ ఆధారంగా రాస్తున్నది. నిజానికి హైస్కూల్లో వుండగా తొలిసారిగా ఎవరెస్టు ఎక్కినవారెవరు? అనే బిట్ క్వశ్చన్‌కు ఆన్సర్ రాసినప్పుడు తప్ప అతని గురించి నేనెప్పుడూ తలచుకోలేదు. అతను ఏ దేశస్తుడో కూడా తెలియదు. ఆ నివాళి చదివిన తర్వాత అతని మానవత్వం, ఉదారత్వం నన్ను మెప్పించాయి. అందుకే ఆ వివరాలు పాఠకులతో పంచుకుంటున్నాను.

అతని పూర్తి పేరు ఎడ్మండ్ పెర్సివల్ హిల్లరీ. న్యూజిలాండ్ దేశస్తుడు. ఆక్లండ్ యూనివర్శిటీలో చదువుకున్నాడు. అప్పుడే కొండల్లో స్కీయింగ్ చేసేవాడు. వాళ్ల నాన్న జర్నలిజం నుండి తేనెటీగల కుటీరపరిశ్రమలో మారాడు. హిల్లరీ కూడా అదే వృత్తిలో ప్రవేశించాడు. తేనెటీగలు పెంచే పెద్ద పెద్ద 90 పౌండ్ల బరువున్న పెట్టెలను కూడా సునాయాసంగా ఎత్తేసేవాడు. ఇవన్నీ పర్వతాధిరోహణ వృత్తికి దోహదపడ్డాయి. హిల్లరీ మౌంటనీరింగ్ అతని 21వ ఏట 1940లో న్యూజిలాండ్‌లోని సదరన్ ఆల్ప్‌స్‌లో ప్రారంభమైంది. 1944 వచ్చేసరికి రాయల్ న్యూజిలాండ్ ఎయిర్‌ఫోర్స్‌లో నావిగేటర్‌గా వునన్నాడు. వాళ్ల స్క్వాడ్రన్ ఫిజిలో వుండగా అతను 1930లలో హిమాలయా పర్వతాధిరోహణ గురించి పుస్తకం చదివి హిమాలయాలపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తర్వాత ఒక అగ్నిప్రమాదంలో చిక్కుకోవడంతో మిలటరీ సర్వీసులోంచి బయటకు రావలసి వచ్చింది కానీ త్వరగానే కోలుకున్నాడు.

తర్వాత హేరీ ఐర్స్ అనే న్యూజిలాండ్ పర్వతారోహకుడితో జట్టుకట్టి 1948లో అతని నేతృత్వంలో న్యూజిలాండ్‌లో అతి ఎత్తయిన (3754 మీటర్లు) మౌంట్ కుక్ ఎక్కాడు. 1950లలో యూరోప్‌లోని ఆల్ప్‌స్ పర్వతాలు ఎక్కసాగాడు. గఢవాల్ హిమాలయాలలోని 7,242 మీటర్ల ఎత్తున్న ముకుట్ పర్వతాన్ని ఎక్కడానికి 1951లో ఒక న్యూజిలాండ్ బృందం ఒకటి సిద్ధమవుతోందని తెలిసి వారిలో చేరాడు. హిమాలయాల్లో వుండగానే వేర్వేరు మార్గాల్లో ఎవరెస్టు పర్వతారోహణ అవకాశాలను అధ్యయనం చేయడానికి ఎరిక్ షిప్‌టన్ అనే బ్రిటిషు అధిరోహకుడి నేతృత్వంలో ఒక టీము తయారవుతోందని విని నేనూ చేరవచ్చా అని ఉత్తరం రాశాడు. షిప్‌టన్ అంగీకరించాడు. అది 1951 ఆగస్టు-నవంబర్ల మధ్య జరిగింది. వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. 1952లో 8,201 మీటర్ల ఎత్తున్న చో ఓయు పర్వతాన్ని ఎక్కడానికి బ్రిటిషు టీము ఏర్పడినపుడు దానిలో చోటు దక్కింది.

చో ఓయు ప్రయత్నం విఫలం కావడంతో ఆ వైఫల్యాన్ని షిప్‌టన్ నెత్తిన రుద్ది 1953 నాటి ఎవరెస్టు టీము నుంచి తప్పించివేశారు. అతని స్థానంలో జాన్ హంట్ అనే అతన్ని తెచ్చారు. అతనే తన సభ్యుల్లోంచి, హిల్లరీ, టెన్జింగ్‌లను ఒక జట్టుగా ఏర్పరచాడు. వారిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఏర్పడి అంతిమంగా వాళ్లే విజయం సాధించారు. తర్వాత కూడా టెన్జింగ్‌తో అతని షెర్పా జాతితో హిల్లరీ అనుబంధం కొనసాగించాడు. హిల్లరీ పోయినప్పుడు టెన్జింగ్ కొడుకు జమ్‌లింగ్ పత్రికలతో మాట్లాడి అనేక వివరాలు చెప్పాడు. ఎవరెస్టు ఎక్కివచ్చాక హిల్లరీ నేపాల్ వెళ్లాడు. స్థానికులకు అతను నచ్చలేదు. మనం పవిత్రంగా పూజించే శిఖరంపై వాడెవడో విదేశీయుడు పాదం మోపి అవమానించడమేమిటని వారి కోపం. హిల్లరీ ఆ విషయం గ్రహించి, మొదట పాదం మోపినది తాను కాదని మీలో ఒకడైన టెన్జింగేనని వాళ్లకు చెప్పాడు.  ‘కానీ మా నాన్న చివరి శ్వాస వరకు నాతో చెప్తూనే వున్నాడు – హిల్లరీయే మొదట అడుగుపెట్టాడని.’ అంటాడు జమ్‌లింగ్.

బయటి ప్రజలకు కూడా ఒకటే కుతూహలం. మీరో ఎవరు ముందు అక్కడ అడుగు పెట్టారు? అని ప్రశ్నలతో వేధించారు. హిల్లరీ వారందరికీ ఒకటే సమాధానం చెప్పాడు – ‘ఇద్దరం ఒకేసారి పెట్టాం.’ అని. ఎవరెస్టు విజయం తర్వాత హిల్లరీని హైసొసైటీ వాళ్లందరూ పార్టీలకు పిలిచేవారు. ‘‘నథింగ్ వెంచర్, నథింగ్ విన్’’ అనే పేర 1975లో విడుదల చేసిన తన ఆత్మకథలో హిల్లరీ యిలాటి జనాభాపై తన అనాసక్తిని వెలిబుచ్చాడు. ‘మనం ఏం చేశామో వాళ్లకు తెలియదు, నాతో ఫోటో దిగి  గొప్పలు చెప్పుకోవడానికే పిలిచేవారు. మాట్లాడుకోవడానికి కామన్ ఇంట్రస్టు వున్న అంశాలేవీ వుండేవి కావు’ అని రాసుకున్నాడు. అయితే యీ విజయంతోనే అతని ధైర్యం పెరిగి అప్పటిదాకా ప్రేమిస్తూన్న లూసీ రోజ్ అనే సంగీతకారిణితో పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. ఆమె ఒప్పుకుంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగింది. ఆ జంటకు ముగ్గురు పిల్లలు.

1954లో ఛార్లెస్ ఇవాన్స్‌తో కలిసి 8,462 మీటర్ల ఎత్తున్న మకాలూ పర్వతాన్ని ఎక్కాడు. ఆ యాత్రలోనే అతనికి పల్మనరీ ఎడిమా వచ్చి, యికపై ఎత్తయిన పర్వతాలు ఎక్కకూడదన్నారు. ఏదో ఒక రకమైన సాహసయాత్రలు చేయాలనే పట్టుదలతో 1955-58 మధ్య అంటార్కిటికాకు వెళ్లి వచ్చాడు. తర్వాతి రోజుల్లో ఉత్తరధృవానికి కూడా వెళ్లాడు. కానీ హిమాలయాలపై ప్రేమ పోలేదు. 1960లో యేతి అన్వేషణ కార్యక్రమంలో పాలుపంచుకున్నాడు. యేతి అనే బాగా ఎత్తున్న వానరమానవుడు చాలాకాలంగా హిమాలయాల్లో తిరుగుతున్నాడనీ, అతని పాదముద్రలు బట్టి అతని ఆనవాలు కనుక్కోవచ్చని అంటూండేవారు. ఆ పుకార్లలో నిజమెంతో కనుక్కోవాలని అమెరికా వాళ్లు ఒక పరిశోధక బృందాన్ని పంపారు. వాళ్లు ఆ పాదముద్రలు హిమాలయాల్లో సంచరించే జంతువులవని తేల్చారు. ఇతను ఆ టీములో ఒకడు. ఇతనితో పాటు భార్య కూడా పాలు పంచుకుని హిమాలయాల వంటి ఎత్తయిన ప్రదేశాల్లో ఎక్కువకాలం జీవిస్తే కలిగే ఫలితాల గురించి పరిశోధించింది.

1961లో మకాలూ అధిరోహణ బృందంలో చేరాడు కానీ సెరెబ్రల్ ఎడిమా వలన 7 వేల మీటర్ల ఎత్తు కంటె ఎక్కువ ఎక్కలేకపోయాడు. అప్పణ్నుంచి తక్కువ ఎత్తున్న పర్వతాలే ఎక్కాడు. అతని కెరియర్ ముగిసిపోయిందనవచ్చు. అయితే అతను హిమాలయాలతో, అక్కడ వున్న షెర్పా జాతివారితో అనుబంధాన్ని తెంచుకోలేదు. సెలబ్రిటీగా తను అమెరికా వంటి దేశాల నుంచి సేకరించిన విరాళాలను అక్కడ ఖర్చు చేయసాగాడు. 1961లో ఖుమ్‌జుంగా అనే గ్రామంలో మొట్టమొదటి షెర్పా స్కూలు కట్టించాడు. 

ఆ తర్వాత మరో 26 స్కూళ్లను, అనేక ఆసుపత్రులను, ఖుమ్‌జుంగ్‌లోనే వాటర్ పైప్‌లైన్‌ను, దూధ్ కోసి నుంచి నామ్చే బజార్ ‌వరకు బ్రిడ్జిని, లుక్‌లా వద్ద ఎయిర్‌స్ట్రిప్‌ను కట్టించాడు. వేలాది ఎవరెస్టు అధిరోహకులకు యీ ఎయిర్‌స్ట్రిప్‌ ఉపయోగపడుతోంది. 2008లో నేపాల్ ప్రభుత్వం దీనికి టెన్జింగ్-హిల్లరీ ఎయిర్‌పోర్ట్ అని పేరు పెట్టింది. వీటితో పాటు 1989లో షెర్పాలకు ప్రీతిపాత్రమైన సెంగ్‌బోచే బౌద్ధాలయం అగ్నిప్రమాదంలో దగ్ధమై పోతే, దాన్ని తిరిగి కట్టించడానికి విరాళాలు సేకరించాడు. హిమాలయన్ ట్రస్ట్ అని ఏర్పరచి దాని ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాడు. వీటికి టెన్జింగ్ కూడా తన వంతు సాయం అందించాడు.

ఈ ప్రాజెక్టులు కట్టించడంలో హిల్లరీ భార్య పాత్ర గణనీయమైనది. పాఫ్లూలో ఆసుపత్రి నిర్మాణాలను పర్యవేక్షించడానికి చిన్న కూతురితో కలిసి ఖట్మండూ నుంచి విమానంలో వస్తూ వుంటే విమానం కూలి యిద్దరూ చనిపోయారు. ఆ మరణంతో కృంగిపోయినా, హిల్లరీ పట్టుదలతో ఆమె ఆశయసిద్ధి కోసం అంటూ మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాడు. హిల్లరీ కొడుకు పీటర్ కూడా పేరున్న పర్వతారోహకుడయ్యాడు. అతనూ, టెన్జింగ్ కొడుకూ యిద్దరూ కలిసి 2002లో ఎవరెస్టు ఎక్కారు. 1977లో గంగా తీరం నుంచి గంగోత్రి వరకు కాలినడకన వెళ్లాడు. హిల్లరీ ఎటువంటి వాడంటే ఎవరెస్టు శిఖరంపై టెన్జింగ్ ఫోటో తీశాడు (పైన చూడవచ్చు) తప్ప, తన ఫోటో తీసుకోలేదు. టెన్జింగ్ 1986లో మరణించినా, అతని కుటుంబంతో సంబంధాలు కొనసాగించాడు. తన యింటి గార్డెన్లో హిమాలయన్ వృక్షాన్ని పాతి, దాని కింద సేదదీరేవాడు. పదికి పైగా పుస్తకాలు రాశాడు.

హిల్లరీని అతని దేశం బాగానే సత్కరించింది. సర్ బిరుదాన్నిచ్చింది అతని ఫోటోతో 5 డాలర్ల నోటు ముద్రించింది. సజీవులైనవారి ఫోటోతో వేయడం అదే ప్రథమం.  స్టాంపు వేసింది (ఫోటో) కొన్ని రహదారులకు అతని పేరు పెట్టింది. మరణించిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఎవరెస్టు అధిరోహణ స్వర్ణోత్సవ సందర్భంగా నేపాల్ ప్రభుత్వం అతనికి గౌరవ పౌరసత్వాన్నిచ్చింది. (ఆ సందర్భంలో హిల్లరీ ఖట్మండూ పర్యటన ఫోటో పైన చూడవచ్చు). ఒక విదేశీయుడికి అలా యివ్వడం అదే ప్రథమం. భారత ప్రభుత్వం 2008లో అతనికి మరణానంతర పద్మవిభూషణ్ యిచ్చింది.  

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

[email protected]