ఒకవైపు కరోనా వైరస్ ను మహమ్మారిగా అభివర్ణించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీన్ని నివారించకపోతే.. భూమిపై మానవాళి ఉనికే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీన్నొక బయోవెపన్ గా అభివర్ణిస్తూ ఉన్నారు. మరోవైపు దేశాలకు దేశాలే లాక్డ్ డౌన్ అయిపోయాయి. దీనికి ఇండియా కూడా మినహాయింపు కాదు. కరోనా విషయంలో వినిపిస్తున్న నంబర్లను నంబర్లుగా చూడవద్దని, అవి ప్రాణాలు అనే సంగతిని గుర్తుంచుకోవాలనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
అదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా విషయంలో జనాలు తమ సృజనాత్మకతకూ పని చెబుతూ ఉన్నారు. ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ లుగా, ఫేస్ బుక్ పోస్టులుగా ఇవి షేర్ అవుతున్నాయి.
వడివేలు ఫొటోలతో ఉండే ఒక మీమ్ తెగ షేర్ అవుతూ ఉంది. అది విదేశాల నుంచి వచ్చిన వారి గురించి. విదేశాల నుంచి వచ్చారంటే వారిని జనాలు గతంలో ఎలా చూసే వాళ్లు, ఇప్పుడు ఎలా చూస్తున్నారనే.. విషయాన్ని వ్యంగ్యంగా చాటుతోంది ఆ పోస్టు. అది దేశమంతా వైరల్ అయిన పోస్టు.
ఇక తెలుగు జనాలూ తమ క్రియేటివిటిని చాటుతున్నారు. 21 రోజుల లాక్ డౌన్ ను బిగ్ బాస్ హౌస్ గా అభివర్ణిస్తూ కొంతమంది వాట్సాప్ స్టేటస్ లు పెడుతున్నారు. ఎవరింటికి వారు పరిమితం అయిపోయే ఈ పరిస్థితి బిగ్ బాస్ హౌస్ ను తలపింపజేస్తోందని వారు చెబుతున్నారు. ఇందులో వ్యంగ్యం ఉన్నా.. బిగ్ హౌస్ లో వాళ్ల పరిస్థితి ఏమిటో, ఇప్పుడు దాన్ని వీక్షిస్తున్న వారందరికీ అర్థం అవుతున్నట్టే.
ఇక చేతులు కడుక్కోవడం, నీట్ నెస్ మెయింటెయిన్ చేయడం గురించి మహానుభావుడు సినిమాను గుర్తు చేస్తున్నాయి ఇంకొన్ని వాట్సాప్ స్టేటస్ లు. ఆ సినిమాలో హీరో ఓసీడీ ప్రాబ్లమ్ తో అవసరం ఉన్న లేకపోయినా, అన్నీ కడిగేసుకుంటూ ఉంటాడు. కరోనా భయాల నేపథ్యంలో ఇప్పుడు జనాలు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని ఈ స్టేటస్ లో చెబుతున్నారు. కరోనా భయాలు ఏమో కానీ, ఇళ్లలో కూర్చుని ఈ క్రియేటివిటీని మాత్రం చాటేస్తూ ఉన్నారు.