దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆ ప్రభావం ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ పై కూడా పడింది. మార్కెట్లో సరుకులు దొరక్కపోయినా ఆన్ లైన్లో దర్జాగా బుక్ చేసుకుందాం అనుకునే వాళ్లకు ఇప్పుడు ఆ ఆనందం కూడా లేకుండా చేసింది లాక్ డౌన్.
నిజానికి లాక్ డౌన్ ప్రకటించినప్పుడే ఆన్ లైన్ గ్రాసరీ సైట్స్ కు సంబంధించి మార్గనిర్దేశకాలు ప్రకటించారు. ఆన్ లైన్ గ్రాసరీస్ కు సంబంధించిన డెలవరీ బాయ్స్ కు తిరగడానికి అవకాశం ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ కేంద్ర ఆదేశాలు క్షేత్రస్థాయికి వచ్చేసరికి మాత్ర అమలవ్వడం లేదు.
పోలీసులు ప్రజల్ని, డెలివరీ బాయ్స్ ను ఒకే గాటన కట్టారు. బయట కనిపిస్తే లాఠీలకు పని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డెలివరీ బాయ్స్ కు కూడా దెబ్బలు తగియాలని స్పష్టంచేసింది బిగ్ బాస్కెట్. ఇండియాలో నిత్యావసరాల్ని ఆన్ లైన్ లో సరఫరా చేసే ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ సర్వీసుల్ని 30శాతానికి కుదించింది. హైదరాబాద్ లో కేవలం 10శాతం మాత్రం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అటు గ్రోఫర్స్ అయితే పూర్తిగా బంద్ అయింది.
తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా సేవల్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం, సాధ్యమైనంత త్వరగా మీ ముందుకొస్తాం అని ప్రకటించి షట్ డౌన్ చేసింది. అమెజాన్ మాత్రం పైకి చెప్పకపోయినా దాదాపు ఇదే పని చేస్తోంది. కొత్తగా ఆర్డర్స్ తీసుకోవడం ఆపేసిన ఈ సంస్థ.. ఆల్రెడీ బుక్ చేసిన ఆర్డర్స్ పై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
ఆన్ లైన్లో కూరగాయలు, పాలు, పళ్లు లాంటి నిత్యావసరాల్ని అందించే సైట్లకు మినహాయింపు ఇచ్చినట్టు మరింత స్పష్టంగా కేంద్రం ప్రకటించి, దాన్ని సమర్థంగా అమలైనట్టు చేస్తే.. దేశంలోని మెట్రో సిటీస్ లో పౌరుల కష్టాలు మ్యాగ్జిమమ్ తగ్గినట్టే. పైగా కరోనా నిరోధానికి ఇది మరింత ఉపయుక్తం కూడా. ప్రజలెవరూ బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా.