మోడీ ప్రజాస్వామ్య ప్ర‌వ‌చ‌నాలు.. బీజేపీ ప్ర‌జాస్వామ్య పాత‌ర‌లు!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ త‌ర‌చూ ప్ర‌జాస్వామ్యం, దాని ప్రాముఖ్య‌త‌, ప్ర‌జాస్వామ్యం మ‌రింత‌గా ప‌రిణ‌తి చెందాల్సిన రీతి గురించి చెబుతూ ఉంటారు! సువిశాల‌, ప్ర‌పంచంలోని అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ ప్ర‌ధాన‌మంత్రిగా మోడీ నిస్సందేహంగా అలాంటి మాట‌లు…

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ త‌ర‌చూ ప్ర‌జాస్వామ్యం, దాని ప్రాముఖ్య‌త‌, ప్ర‌జాస్వామ్యం మ‌రింత‌గా ప‌రిణ‌తి చెందాల్సిన రీతి గురించి చెబుతూ ఉంటారు! సువిశాల‌, ప్ర‌పంచంలోని అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ ప్ర‌ధాన‌మంత్రిగా మోడీ నిస్సందేహంగా అలాంటి మాట‌లు చెప్పేందుకు అర్హులే. 

ఇంత పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో వ‌ర‌స‌గా రెండోసారి ప్ర‌ధానిగా ఎన్నిక‌యిన ఆయ‌న ప్ర‌జాస్వామ్యం మ‌రింత‌గా పురోగ‌మించాల‌ని, కొత్త కొత్త పంథాల‌ను అనుస‌రించాల‌ని, ఇంకా గొప్ప గొప్ప ప్ర‌జాస్వామ్య అద్భుతాలు జ‌ర‌గాలంటూ ప్ర‌ధాన‌మంత్రి త‌ర‌చూ చెబుతూ ఉంటారు! ఒక ప్ర‌ధాన‌మంత్రి హోదా లో ఇలా చెప్ప‌డం సంగ‌త‌లా ఉంచితే, త‌నో ప్ర‌పంచ నాయ‌కుడిని అని చాట‌డానికి మోడీ అలాంటి ప్ర‌వ‌చ‌నాలు చేశార‌నుకోవాలి.

ప్ర‌జాస్వామ్యం నుంచి వ‌చ్చిన గొప్ప గొప్ప నాయ‌కులు గ‌తంలో ప్ర‌జాస్వామ్యం దాని తీరుతెన్నుల గురించి ప్ర‌వ‌చ‌నాలు చెప్పారు. అలాంటి మాట‌లు చ‌రిత్ర‌లో నిలిచిపోయాయి. ప్ర‌జాస్వామ్యం అనే చ‌ర్చ‌కు వారి మాట‌లు మార్గ‌ద‌ర్శ‌కాల‌వుతూ ఉంటాయి. మ‌రి అలాంటి వారి స‌ర‌స‌న నిల‌బ‌డ‌టానికి మోడీ ప్ర‌జాస్వామ్యం గురించి ర‌క‌ర‌కాల మాట‌లు చెబుతూ ఉంటార‌నుకోవాలి.

మోడీ మాట‌ల మానియా అలా ఉంటే.. దేశంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్ట‌డంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ రికార్డులు సృష్టిస్తూ ఉంది. అధికారంలోకి వ‌చ్చిన ఎనిమిదేళ్లకు భార‌తీయ జ‌న‌తా పార్టీ వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్ట‌డంలో కొత్త రికార్డుల దిశ‌గా సాగుతోంది.  గ‌తంలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నేప‌థ్య‌మే ఉంది.

కేంద్రంలో తిరుగులేని అధికారాన్ని క‌లిగి ఉన్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప‌నులెన్నో చేసింది. అలాంటి చ‌ర్య‌ల‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కానీ, స‌మ‌ర్థ‌న కానీ లేదు. గతంలో అలాంటి రాజ‌కీయాల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ప్పు ప‌ట్టింది. కాంగ్రెస్ విధానాల‌ను నియంతృత్వ విధానాలుగా త‌ప్పు ప‌ట్టింది. ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం పై విరుచుకుప‌డుతూ వ‌చ్చింది.

అయితే రెండోసారి కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాకా బీజేపీ ఇలాంటి ప‌నుల‌ను గ‌ట్టిగా పెట్టుకుంది. గ‌త కొంత‌కాలంలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల‌తో పాటు తాజాగా మ‌హారాష్ట్ర‌లో కూడా ప్ర‌భుత్వాన్ని కూల్చి త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. సాంకేతిక లెక్క‌లు, తిరుగుబాట్లు, వీటిని అడ్డం పెట్టుకుని క‌మ‌లం పార్టీ అంత‌టా త‌మ జెండాల‌ను పాతుతూ ఉంది. ఈ వ్య‌వ‌హారాల‌ను బీజేపీ త‌న‌దైన రీతిలో స‌మ‌ర్థించుకుంటూనే ఉంది. క‌మ‌లం పార్టీ భ‌క్తులు ఈ విష‌యంలో బిజీగా ఉంటారు.

ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డ‌మే ఒక ప‌ని అయితే, మోడీ మాత్రం ప్ర‌జాస్వామ్యం భావ‌న‌ల గురించి పెద్ద పెద్ద మాట‌లు చెబుతూనే ఉంటారు. ప్ర‌జాస్వామ్యం కొత్త దిశ‌గా ప‌రిభ్ర‌మించాల‌న్న‌ట్టుగా మోడీ ల‌క్ష్యాల‌ను నిర్దేశిస్తూ ఉంటారు. బీజేపీనే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డంలో బిజీగా ఉంటుంది. ఇదీ సంగ‌తి!