కరోనా నివారణకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన వంతు ఆర్థిక సాయంగా రూ.10 లక్షల విరాళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ ఒక నెల జీతం ఇచ్చేందుకు నిర్ణయించినట్టు బాబు మంగళవారం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో బాబు విరాళంపై నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మిత్రడు పల్లవోలు రమణ అనే సామాజికవేత్త తన ఫేస్బుక్లో “కరోనా నివారణకు మాజీ సీఎం చంద్రబాబు గారు భూరి విరాళం ప్రకటించారు. ఆ మొత్తం రూ.10 లక్షలు” అని పోస్ట్ చేశాడు.
దానిపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. చారిత్రిక దానకర్ణుడు అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే మరొకరు వామ్మో పది లక్షలా; మరొకరు ధర్మరాజుకు మించిన వాడే అని బాబు విరాళంపై స్పందించారు. వీరి కామెంట్స్‌కు పల్లవోలు రమణ తనదైన శైలిలో అదిరిపోయే పంచ్ వేశాడు. “ఈ మొత్తం కూడా మళ్లీ ఎన్నికలొచ్చేదాకా…పది విడతలుగా ఇస్తూ…తర్వాత అధికారంలోకి వస్తానే మిగిలింది ఇస్తాడేమో మన బాబు గారు” అని తన పోస్టుకు తానే కామెంట్ పెట్టాడు. గత ఐదేళ్ల తన పాలనలో చంద్రబాబు రైతుల రుణమాఫీ విషయంలో మూడు విడతలు చెల్లించి, మిగిలిన రెండు విడతల మొత్తాన్ని ఎగ్గొట్టడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన కామెంట్ చేశాడా మిత్రుడు.
నిరుద్యోగ భృతి విషయంలో కూడా బాబు చివరి ఏడాదిలో మొక్కుబడిగా కొంత మంది నిరుద్యోగులకు మొదట రూ.1000, తర్వాత ఎన్నికలు రెండు నెలలు ఉండాయనగా మరో వెయ్యి పెంచి రూ.2000…ఇలా అనేక అంశాల్లో బాబు పాలన కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే అని అభిప్రాయాన్ని కలిగించింది.
తాజాగా కరోనాపై పోరాటంలో బాబు విరాళం కూడా…అలాంటిదేమో అని ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా సామాజికవేత్త పోస్ట్‌తో పాటు కామెంట్ కూడా పెట్టాడు. బాబు ఏం చేసినా…ఆయన అప్రజాస్వామిక పాలన వెంటాడుతూనే ఉంటుందనేందుకు ఈ పోస్టే ఉదాహరణ.