రాజకీయాల్లో గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎట్టకేలకు బీజేపీలో చేరడానికి నిర్ణయించారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, అగ్రనాయకులు రావడంతో వారి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరనున్నట్టు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
మొదట టీఆర్ఎస్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. కేటీఆర్‌తో విభేదాల వల్ల ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరి అదృష్టాన్ని పరీక్షకు పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు రోజులు బాగా లేవని జ్ఞానోదయం కావడానికి కొండాకు ఎంతో కాలం పట్టలేదు. దీంతో కాంగ్రెస్‌కు కూడా దూరంగా వుంటున్నారు. కానీ రాజకీయంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ వచ్చారు.
ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన సొంత కుంపటి పెడతారనే ప్రచారం జరిగింది. అది జరగలేదు. ఈటల కాషాయ కండువా కప్పుకుని మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పలు దఫాలు చర్చలు జరిపారు.
ఇటీవల కొండాతో విశ్వేశ్వరరెడ్డి కీలక చర్చలు జరిపారు. టీఆర్ఎస్‌తో భవిష్యత్ సంబంధాలపై క్లారిటీ అడిగినట్టు కొండా చెప్పారు. టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రధాన ప్రత్యామ్నాయమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీతో రాజీ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని బీజేపీ నేతలు చెప్పారని కొండా ప్రకటించారు.
అయితే రెండు మూడు అంశాల్లో క్లారిటీ రావాల్సి ఉందని, అది వచ్చిన తర్వాత బీజేపీలో చేరుతానని చెప్పారు. బహుశా తనకు కావాల్సిన క్లారిటీ ఏదో ఇప్పటికి వచ్చినట్టుంది. ఇవాళ్టి నుంచి ఆయన బీజేపీ నాయకుడిగా తెలంగాణలో గుర్తింపు పొందనున్నారు.