ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. అలాగే రెండవసారి గెలిచాక ఏకంగా ఉప ముఖ్యమంత్రి వంటి అతి పెద్ద హోదా లభించింది. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఆమె ఉన్నారు. అయితే ఆమె రాజకీయంగా దూకుడు ప్రదర్శించలేకపోవడంతో పాటు ఎవరితోనూ కలవకపోవడంతో మలి విడత విస్తరణలో పదవి పోయింది.
అయినా కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాకు ఆమెను వైసీపీ అధ్యక్షురాలిగా జగన్ నియమించి ప్రాధాన్యత కల్పించారు. ఈ జిల్లా పరిథిలోకి వచ్చే నాలుగు అసెంబ్లీ సీట్లను వచ్చే ఎన్నికలలో పుష్ప శ్రీవాణి గెలిపించాలి. దానికంటే ముందు ఆమె తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం సీటును మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి.
ఇలా ఈ యువ నాయకురాలి ముందు చాలా పెద్ద లక్ష్యాలే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆమెకు రాజకీయ ప్రత్యర్ధిగా తెలుగుదేశం ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ నిండా ఆమె అత్తింటివారే ఉన్నారు. ఆమె పెదమామ, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఇక సొంత ఆడపడుచు పల్లవీరాజ్ ఈ మధ్యనే టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికలలో ఆమె వదిన మీద పోటీ చేయనుంది. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పుష్ప శ్రీవాణి అయిదు వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారని ఆడపడుచు, పెదమామ ఒకేసారి ఆరోపణలు చేశారు.
అంత ఆస్తి తనకు లేదని పుష్ప శ్రీవాణి రుజువు చేసుకోవాలని వారు డిమాండు చేశారు. తాము పుష్ప శ్రీవాణి ఆస్తులు ఏమిటన్నవి నిరూపిస్తామని కూడా సవాల్ చేస్తున్నారు. అయితే తనకు అయిదు కోట్ల ఆస్తి ఉన్నట్లు రుజువు చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని పుష్ప శ్రీవాణి అంటున్నారు.
మొత్తానికి ఆమె మీద వచ్చిన ఆ ఆరోపణలను జనాలు ఎంతవరకూ నమ్ముతారో తెలియదు కానీ ఈ అస్త్రాన్నే ముందు పెట్టి చెలరేగిపోవాలని అత్తింటి వారు చూస్తున్నారు.