ఏకనాథుడే ‘మహా’సారథి ఎందుకయ్యాడు?

పైకి ఒకేఒక్కడు. చీలికకు నాథుడు. ‘ఏక్‌’నాథుడు. శివసేనను కోసేశాడు. పెద్ద ముక్కను తనతో వుంచుకున్నాడు. (చీలిక చెల్లాలంటే శాసన సభ్యుల్లో రెండో వంతు కావాలి.). ఆ ముక్క పట్టుకుని కాషాయ నగరోంలను దాటలేదు. మహారాష్ట్రలో…

పైకి ఒకేఒక్కడు. చీలికకు నాథుడు. ‘ఏక్‌’నాథుడు. శివసేనను కోసేశాడు. పెద్ద ముక్కను తనతో వుంచుకున్నాడు. (చీలిక చెల్లాలంటే శాసన సభ్యుల్లో రెండో వంతు కావాలి.). ఆ ముక్క పట్టుకుని కాషాయ నగరోంలను దాటలేదు. మహారాష్ట్రలో శివసేనాని ఉద్ధవ్‌ థాకరే కదలిపోయాడు. ముందు ఈ చీలిక చెల్లకుండా చెయ్యాలని, గోడదాటిన శాసన సభ్యుల్ని సస్పెండ్‌ చేయించాడు. 

ఏకనాథుడు ఎకాఎకిన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ సస్పెన్షన్‌ చెల్లదన్నది న్యాయస్థానం. బంతి గవర్నర్‌ దగ్గర పడిరది. ముఖ్యమంత్రిగా వున్న ఉద్ధవ్‌ థాకరేను సభలో బలనిరూపణ చేసుకోమన్నారాయన. బలముంటే కదా, నిరూపించుకోవటానికి? అందుకే సీఎం కుర్చీని ఒకరోజు ముందే దిగిపోయాడు. ఏక్‌ నాథుడు, అనేక నాథుడయి, తన వద్ద వున్న సభ్యులను వెంటబెట్టుకుని మహారాష్ట్ర వచ్చాడు.

ఇంతవరకూ ఏకనాథుడు మాత్రమే తెరపై కనిపించాడు. మరి తెరవెనుక? ఇంకెవరు? బీజేపీ నేతలే వుంటారు. ఏకనాథుడు చీల్చిన ‘శివసేన’ను కలుపుకుని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అందరూ భావించారు. ఇంకేముంది? ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని అందరూ భావించారు. ఈయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా వున్నారు. ముందు అయిదేళ్ళున్నాడు. రెండో సారి (2019లో)  అయిదు రోజులు కూడా లేరు.  

ఇలా ప్రమాణం చేసి, అలా తప్పుకున్నారు. మళ్ళీ రెండున్నరేళ్ళు తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని ఆయనే బీజేపీ నేతగా చేజిక్కించుకుంటారనుకున్నారు. కానీ, బీజేపీ అధినేతలు (మోడీ, షా, నడ్డాలు) వేరే విధంగా భావించారు. ఆ కుర్చీని ఏక్‌ నాథుడికే ఇవ్వాలనుకున్నారు. దాంతో ఏక్‌ నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసేశారు. ఈ సినిమాకు ఇది ‘శుభం కార్డు’ కాదు. ఇంటర్వెల్‌ ట్విస్టు మాత్రమే. బీజేపీ ఈ ‘ట్విస్టు’ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది అర్థం కావాలీ` అంటే మూడు స్క్రీన్‌ ప్లేలు చూడాలి. ఈ మూడూ మూడు పక్షాలవి.

ఒకటి: హిందూత్వ కైంకర్యం` బీజేపీ స్క్రీన్‌ ప్లే

అవును. ఏక్‌నాథ్‌ షిండే కూడా కిందనుంచి వచ్చిన వాడే. ఒకప్పుడు కుటుంబ పోషణకు ఆటో రిక్షా నడిపిన వాడు. అంచెలంచెలుగా శివసేనలో ఎదిగినవాడు. అంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేదు. మరి? శివసేన ఇంకా చీలాలి. అదేమిటి? ఇప్పుడు చీలింది చీలిక కాదా? చీలికే. అది నిలువుగా చీలిన చీలిక. శివసేన శాసన సభ్యుల్ని మాత్రమే ఆయన చీల్చాడు. మొత్తం 55 శాసన సభ్యుల్లో  ‘చీలిక శివసేన’లోకి 39 మందిని తేగలిగారు. ఇప్పుడు ఉద్ధవ్‌ ‘శివసేన’లో వున్నది 16 మంది మాత్రమే. శాసన సభ వరకూ తన షిండేతో మెజారిటీ వర్గం కావచ్చు. కానీ ఇంకా శివసేన పార్లమెంటు సభ్యులు వున్నారు. లోక్‌ సభలో 19 మందీ, రాజ్యసభలో ముగ్గురూ వున్నారు. ఈ సమూహంలో చీలిక తేవాలి. శివసేన అంటేనే కార్యకర్తలు. వారి విధేయతలను మార్చాలి. అన్నింటిని మించి, శివసేన పార్టీ పేరునూ, ఎన్నికల గుర్తునూ షిండే వర్గం సంపాదించుకోవాలి. అసలు శివసేన అంటే, షిండే శివసేనే` అని చెప్పగలగాలి.

ఇంతవరకూ ముందే బీజేపీ ముందే ఆలోచించి పెట్టుకుంది. ఈ చీలికకు సర్వస్వతర్రతమైన ఉనికిని తేవాలన్నది మాత్రం తర్వాత వచ్చిన యోచన. ఎందుకంటే, బీజేపీ లేదా బీజేపీ దర్శకత్వంలో షిండే చేసిన ‘హిందూత్వ’ కవ్వింపులకు, ఊహించిన ప్రతి స్పందన ఉధ్ధవ్‌ నుంచి రాలేదు. బాలథాకరే హిందూత్వకు తామే వారసులమని షిండే వర్గీయులు ఢంకా భజాయించి చెబుతున్నా, ఉధ్ధవ్‌ ఉలక లేదు పలకలేదు. 

కాకుంటే తనదే అసలైన శివసేన, అని మాత్రం ముక్తసరిగా చెప్పారు. ఆపైన తనకూ ‘మహా వికాస్‌ అగాధీ’లోని ఎన్సీపీ, కాంగ్రెస్‌ వంటి ‘సెక్యులర్‌ పార్టీలకు’ వుండే మైత్రి ఎంత గాఢమైనదో చెప్పే ప్రయత్నం చేశారు. అదీకాక అతి త్వరలో ‘బృహ్మణ్ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌’ ఎన్నికలు మీదకు వస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా ఈ  కార్పోరేషన్‌ పై ‘శివసేన’ పతాకమే ఎగురుతోంది. బీజేపీ ఈ కార్పోరేషన్‌ ను కైవసం చేసుకోవాలంటే షిండే (తిరుగుబాటు) శివసేనను ముందుంచాలి. అంటే షిండే వర్గాన్ని పైకెత్తాలి. ఉద్ధవ్‌ ఎత్త దలిచిన ఈ కొత్త సాత్విక అవతారానికి ఇదే విరుగుడు. అందుకే ఆఖరి నిమిషంలో ఫడ్నవీస్‌ స్థానంలోకి షిండేను  దించింది.

రెండు: సాత్విక హిందూత్వ` ఉధ్ధవ్‌ శివసేన స్క్రీన్‌ప్లే

ఎన్సీపీ, కాంగ్రెస్‌ ల చెంతకు ఎంత దగ్గరగా జరిగినా,  ‘హిందూత్వ’ను వదల్లేదు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ‘సాత్విక (సాఫ్ట్‌) హిందూత్వ’ తో ‘తీవ్ర (హార్డ్‌) హిందూత్వ’ పార్టీ బీజేపీని ఢీకొనాలనుకుంటున్నారా? కావచ్చు. పశ్చిమ బెంగాల్‌ లో మమత,ఢిల్లీ, పంజాబ్‌ లలో కేజ్రీవాల్‌ ఈ ‘సాత్విక హిందూత్వ’తోనే కదా, విజయం సాధించిందీ? రేపు బృహణ్ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌ లో విజయం సాధించాలంటే, బీజేపీని ‘హిందూత్వ’తోనే మట్టు పెట్టాలి. 

అందుకు ‘మరాఠీ’ స్థానికతను కూడా జోడిరచాలి. పైపెచ్చు, షిండే థానేకు చెందిన వాడు. ఆయనకు కానీ, ఆయనతో వున్న ఇతర శివసేన శాసన సభ్యులకు కానీ గ్రామీణ మహారాష్ట్ర మీద వున్న పట్టు, నగర మహారాష్ట్ర మీద లేదు. మరీ ముఖ్యంగా ముంబయి మీద దాదాపు లేదు. ఈ సందర్బంలో ఉధ్ధవ్‌ శివసేనకు ముందస్తుగా కానీ, తర్వాత కానీ ఈ ఎన్నికలలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ ల మైత్రి అవసరం. పైపెచ్చు శివసేన కార్యకర్తల్లో అధికభాగం తన వెంటవుంటారన్న ధీమా వుండనే వుంది. అందుకోసం ‘మరాఠీ’ స్థానికతతో కూడిన, ‘సాత్విక హిందూత్వ’ను ఉధ్ధవ్‌ జపిస్తే, తక్షణ ప్రయోజనం వుంటుంది.

మూడు: పెద్దన్న పాత్ర` ఎన్సీపీ స్క్రీన్‌ ప్లే

ఈ డ్రామా మొత్తాన్ని నిశ్శబ్దంగా పరికిస్తూ, నిలువరించటానికి పెద్దగా ప్రయత్నం చెయ్యని రాజకీయ వ్యూహకర్త, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. కాకుంటే, మధ్యలో ఉధ్ధవ్‌ ను కలసి తన మద్దతును ప్రకటించి వచ్చారు. అంతే. అందుకు కారణం లేక పోలేదు. ఈ రెండున్నరేళ్ళ ‘ఎంవిఎ’ సంకీర్ణంలో, ఉద్ధవ్‌ పాలనను ఎక్కువ ప్రభావితం చేసింది శరద్‌ పవార్‌. ఫలితంగా కాంగ్రెస్‌ కన్నా, ఎన్సీపీయే ప్రముఖంగా కనిపించింది. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి, ఎన్సీపీ సీనియర్‌ పార్టనర్‌ గా వుంటుంది. వెనుక మరో జూనియర్‌ పార్టనర్‌గా చిక్కి శల్యమైన ఉద్దవ్‌ శివసేన వుంటుంది. అప్పుడు బీజేపీతో ఎన్సీపీ ముఖాముఖి తలపడే అవకాశముంటుంది.

ప్రత్యర్థుల స్క్రీన్‌ ప్లేలను ఎంతో, కొంత ఊహించే, షిండే శివసేనను పదిలంగా కొన్నాళ్ళు కాపాడాలని బీజేపీ భావించింది. అతడికి ముఖ్యమంత్రి పీఠాన్నిచ్చింది.

– సతీష్ చందర్