యాంటీబాడీ కాక్ టెయిల్.. ఇది ఇంకో ఉత్తుత్తి మందు కాదు క‌దా?

ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా ట్రీట్ మెంట్ లో భార‌తీయ వైద్యులు ప‌లు ప్ర‌యోగాలు చేశారు, చేస్తున్నారు. వీటిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా దృష్టి సారించింది. అంత‌ర్జాతీయంగా వీటిని ఆమోదించ‌డానికి అయినా, ఇండియాలో వీటిని…

ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా ట్రీట్ మెంట్ లో భార‌తీయ వైద్యులు ప‌లు ప్ర‌యోగాలు చేశారు, చేస్తున్నారు. వీటిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా దృష్టి సారించింది. అంత‌ర్జాతీయంగా వీటిని ఆమోదించ‌డానికి అయినా, ఇండియాలో వీటిని వాడొచ్చ‌ని భ‌రోసా ఇవ్వ‌డానికి అయినా.. డ‌బ్ల్యూహెచ్వో కొన్ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్  డాటాను కోరింది! అయితే.. ఈ విష‌యంలో మాత్రం భార‌తీయ ఆల్లోప‌తి వైద్య ప‌ద్ధ‌తులు భంగ‌పాటుకు గుర‌య్యాయి. 

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌గ్గ‌ర ఈ వ్య‌వ‌హారం ఆగిపోవ‌డ‌మే కాదు, ఇండియాలో క‌రోనా పేషెంట్ల‌కు  వైద్యులు రాస్తున్న ప‌లు మందుల‌తో ఏ మాత్రం ఉప‌యోగం లేద‌ని, వాటిని వాడొద్ద‌ని కూడా డ‌బ్ల్యూహెచ్వో తేల్చి చెప్పింది. వీటిల్లో కొన్ని ట్యాబ్లెట్లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఊప‌రితిత్తులపై ప్ర‌భావం చూపే ప‌లు ట్యాబ్లెట్ల‌ను వాడొద్దంటూ బ‌హిరంగ హెచ్చ‌రిక‌లు కూడా జారీ అయ్యాయి. అయితే.. వాటిని మ‌న వైద్యులు ఎంత వ‌ర‌కూ ప‌ట్టించుకుంటున్నారో తెలియ‌దు. 

ఇండియాలో క‌రోనా రోగుల ప్రిస్క్రిప్ష‌న్ల‌ను ప‌రిశీలిస్తే.. డ‌బ్ల్యూహెచ్వో వాడొద్దంటున్న ప‌లు మాత్ర‌లు ఉండ‌నే ఉంటాయి. నిమోనియోకు వాడే చాలా ర‌కాల మందుల‌ను క‌రోనాకు రాసేస్తున్నారు భార‌తీయ వైద్యులు. అది కూడా ఐదు రోజులు, ప‌ది రోజుల పాటు ఇలాంటి మందులే రోగుల‌పై ప్ర‌యోగించ‌బ‌డుతున్నాయి. వీటి ద్వారా క‌రోనా నుంచి కోలుకునే అవ‌కాశాలు లేవ‌ని ప‌రోక్షంగా డ‌బ్ల్యూహెచ్వో చెబుతోంది. 

అలాగే రెమిడిస్విర్ ను వాడ‌నే వాడొద్ద‌ని డ‌బ్ల్యూహెచ్వో తేల్చి చెబుతోంది. అయితే ఇండియాలో వైద్యులు రెమిడిస్విర్ కు భారీ డిమాండ్ ను సృష్టించి, బ్లాక్ లో అవి అమ్మ‌కాలు సాగించేంత వ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం. న‌కిలీలు వ‌చ్చాయి, ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు అమ్ముకున్నారు. అయితే డ‌బ్ల్యూహెచ్వో రెక‌మెండేష‌న్లు రెమిడిస్విర్ కు పూర్తి వ్య‌తిరేకంగా ఉన్నాయి. 

ఇక క‌రోనా ఫ‌స్ట్ వేవ్ లోనే ప్లాస్మా థెర‌పీ బాగా పాపుల‌ర్ అయ్యింది. క‌రోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను ఇవ్వొచ్చ‌ని ప్ర‌చారం చేశారు. దీనికి సెల‌బ్రిటీలు కూడా ఉచిత ప్ర‌చార‌క‌ర్త‌ల‌య్యారు. త‌మ‌కు క‌రోనా రాగానే, వారు ప్లాస్మా డొనేష‌న్ గురించి మాట్లాడారు. ఢిల్లీలో ప్లాస్మా థెర‌పీతో ప్ర‌యోజ‌నాలు క‌నిపించిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇప్పుడు ప్లాస్మా థెర‌పీ ఊసు లేదు! క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ లో అది కూడా రుజువు కాలేక‌పోయింద‌ని తెలుస్తోంది.

ఇంత‌లో యాంటీబాడీస్ కాక్ టెయిల్ అంటూ కొత్త విధానం ప్ర‌చారానికి నోచుకుంటోంది. అదిగో పులి అన‌గానే ఇదిగో తోక అనే భార‌తీయ మీడియా.. ఈ యాంటీ బాడీ కాక్ టెయిల్ తో క‌రోనాకు మందు వ‌చ్చేసిన‌ట్టే అంటూ ప్ర‌చారాన్ని విప‌రీత స్థాయిలో సాగిస్తూ ఉంది.  ఒక తెలుగు టీవీ చాన‌ల్ అయితే .. గంట‌లో క‌రోనాకు చెక్ అంటూ దీని గురించి ప్ర‌చారం మొద‌లుపెట్టింది. క‌రోనా తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలున్న పేషెంట్ల‌కు కూడా ఈ యాంటీ బాడీస్ కాక్ టెయిల్ ఇచ్చారంటే.. వారు గంట‌లో ఇంటికి వెళ్లిపోవ‌చ్చ‌ని.. ఈ గంట థియ‌రీని ఆ మీడియా సంస్థ ప్ర‌చారం చేస్తోంది. 

అయితే… గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ యాంటీ బాడీస్ కాక్ టెయిల్ పై కూడా ఎక్క‌డా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌గ‌లేదు! హ‌ర్యానాలో వాడార‌ని, ట్రంప్ ఈ చికిత్స విధానంతోనే వారం రోజుల్లో క‌రోనా నుంచి కోలుకున్నాడ‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఈ యాంటీ బాడీస్ కాక్ టెయిల్ ధ‌ర కూడా 60 నుంచి 70 వేల స్థాయిలో ఉంటుంద‌ట‌.

రెమిడిస్విర్ త‌ర‌హాలో ఇప్పుడు దీంతో వ్యాపారం మొద‌ల‌వుతుందేమో! ఇంత‌కీ ఈ యాంటీబాడీస్ కాక్ టెయిల్ థియ‌రీ ఏమిటంటే.. సాధార‌ణంగా క‌రోనా సోకిన  వారిలో యాంటీ బాడీస్ త‌యారయ్యేందుకు 14 రోజుల వ్య‌వ‌ధి ప‌డుతుంద‌ట‌. శ‌రీరంలో 14 రోజుల్లో వైర‌స్ అంత‌య్యేంది కూడా ఈ థియ‌రీ మీదే. ఇంత‌కీ ఆ యాంటీబాడీస్ కాక్ టెయిల్ అంటే ఏమిటంటే.. శ‌రీరంలో క‌రోనా పై త‌యార‌య్యే యాంటీ బాడీస్ ను ల్యాబ్ లో సృష్టి స్తారు. బ‌య‌టే వాటిని సృష్టించి, కాక్ టెయిల్ గా దాన్ని శ‌రీరంలోకి ఎక్కిస్తారు. దీని వ‌ల్ల శ‌రీరంలో యాంటీ బాడీస్ త‌యారు కాక‌ముందే… క‌రోనాకు చెక్ ప‌డుతుంద‌న‌మాట‌.

ఇక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, దీనిపై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్  జ‌ర‌గాలి, బ‌హుళ సంఖ్య‌లో ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయి? స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బాడీస్ త‌యార‌య్యే అవ‌కాశాలు దెబ్బ‌తింటాయా? అనే అంశాల‌పై స్ప‌ష్ట‌మైన స‌మాచారాలు రావాలి. ఫ్లాస్మా థెర‌పీ, రెమిడిస్విర్ త‌ర‌హాలో.. కాకుండా, క‌నీసం దీనిపై అయినా స్ప‌ష్ట‌మైన క్లినిక‌ల్  ట్ర‌య‌ల్స్ జ‌రిగి, ఆమోద‌యోగ్య‌మైన రీతిలో చికిత్స‌ను అందిస్తే.. మంచిదే.

అలా కాకుండా.. గుడ్డెద్దు చేలో ప‌డ్డ‌ట్టుగా ఈ వ్య‌వ‌హారాన్ని కూడా అబాసుపాల్జేసుకుంటే.. పోయేది వైద్యుల ప‌రువే. కేవ‌లం ఫార్మా కంపెనీల లాభం కోసం ఉత్తుత్తి మందుల పేర్ల‌ను ప్ర‌చారం చేస్తూ, జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డాన్ని ఇక‌నైనా ఆపితే మంచిది. లేక‌పోతే వైద్య‌రంగం మ‌రింత‌గా న‌మ్మ‌కం కోల్పోతుంది. 

ఇక మీడియా అర్ధ‌జ్ఞానులు కూడా గంట‌లో చికిత్స‌, అర‌గంట‌లో చికిత్స‌, జ‌స్ట్ యాభై వేలే, ల‌క్షే అంటూ.. ఇలాంటి మెడిసిన్ బ్లాక్ మార్కెట్ ను ప్రోత్స‌హించ‌డానికి త‌మ వంతు స‌హ‌కారం అందించే ముందు, కాస్త ఆలోచిస్తే మంచిదేమో!