తెలుగుదేశం పార్టీ తాజాగా మహానాడు జరుపుకుంది. ఆ మహానాడులో చాలా తీర్మానాలు ఆమోదించారు. కానీ ఆంధ్రాకే హక్కు లాంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద మాత్రం తీర్మానం చేయలేకపోయారు.సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగానే కడిగేశారు.
తాము అసెంబ్లీలో తీర్మానం చేశామని, విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్నామని, మరి విశాఖ ఉక్కు విషయంలో గుండెలు బాదుకునే టీడీపీ పెద్దలు పార్టీ వేదిక మీద ఎందుకు తీర్మానం చేయలేదు అని నిలదీశారు.
దీనికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు బదులిచ్చిన తీరే విస్మయంగా ఉంది. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ ఎంపీ ఎదురు సవాల్ చేస్తున్నారు. అలా కనుక చేస్తే వైసీపీకి చిత్తశుద్ధి ఉన్నట్లు లెక్కట.
మరి ఇంతకాలం అసెంబ్లీ తీర్మానం అని అడిగారు. అది పూర్తి అయింది. ఇపుడు మరో కొత్త డిమాండ్ పెడుతున్నారు. బాగానే ఉంది కానీ ఇంతకీ టీడీపీ మహానాడులో ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఎందుకు తలవలేదు అన్న దాని అబ్బాయి సమాధానం చెప్పగలరా అంటోంది వైసీపీ.
ఇక్కడ టీడీపీ డొల్లతనం బయటపడిందని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. తాము రేపటి రోజున పార్లమెంట్ లో కూడా ఇదే అంశం ప్రస్తావిస్తామని కూడా చెబుతున్నారు. మొత్తానికి టీడీపీకి మాత్రం విశాఖ ఉక్కు కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయని వైసీపీ నాయకులు అంటున్నారు.