దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం కొనసాగుతూ ఉంది. మే ద్వితీయార్థం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే నెల చివరి రోజున వెల్లడైన నంబర్లలో రోజువారీ కేసుల సంఖ్య లక్షన్నర స్థాయికి చేరింది.
మే 31న వెల్లడైన నంబర్ల ప్రకారం 24 గంటల వ్యవధిలో 1.52 లక్షల పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక దశలో రోజు వారీ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు మించి నమోదైన సంగతి తెలిసిందే. ఆ సంఖ్య లక్షన్నర స్థాయికి రావడం ఊరటను ఇచ్చే అంశం.
గమనిస్తే ప్రతి వారం కొత్త కేసుల సంఖ్యలో రోజువారీగా 50 వేల క్షీణత కనిపిస్తూ ఉంది. గత వారంలో రోజుకు రెండు లక్షల స్థాయిలో కేసులు రాగా, నిన్నటి ఆదివారంతో ఆ సంఖ్య లక్షన్నర స్థాయికి చేరింది. ఇదే స్థాయిలో క్షీణత కొనసాగితే.. ఈ వారాంతానికి రోజువారీ కేసుల సంఖ్య లక్ష స్థాయికి తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
గ్రోత్ రేట్ లేదు కాబట్టి.. కేసుల సంఖ్య తగ్గే కొద్దీ క్షీణత కూడా మరింత వేగం కావొచ్చు. కేంద్ర ప్రభుత్వ నిపుణుల అంచనాల ప్రకారం.. జూన్ నెల ముగిసే సమయానికి దేశం పూర్తిగా ఈ సెకెండ్ వేవ్ నుంచి బయట పడే అవకాశాలున్నాయి. జూన్ లో రోజువారీగా కేసుల సంఖ్య 20 వేల స్థాయికి పడిపోవచ్చని కేంద్ర కమిటీ ఇది వరకే ప్రకటించింది.
మరోవైపు పాజిటివిటీ రేటు కూడా తగ్గిందని కేంద్రం చెబుతోంది. చేస్తున్న పరీక్షల్లో పది శాతం లోపు మాత్రమే పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నాయని ప్రకటించింది. ఒక దశలో పాజిటివిటీ రేటు 20 శాతం వరకూ ఉండేది. ప్రస్తుతం దేశంలో రోజు వారీగా దాపు 20 లక్షల టెస్టులు జరుగుతున్నాయి. అయితే సెకెండ్ వేవ్ కరోనాలో నమోదవుతున్న మరణాలు మాత్రం ఆందోళన కరమైన స్థాయిలోనే ఉన్నాయి.
ఫస్ట్ వేవ్ లో రోజుకు లక్ష కేసులు వచ్చిన తరుణంలో కూడా కరోనా కారణ మరణాలు వెయ్యి స్థాయిలో నమోదయ్యాయి. అయితే ఇప్పుడు రోజువారీ కేసులు లక్షన్నర స్థాయిలో నమోదు అవుతున్న దశలో కూడా మరణాలు రోజుకు మూడు వేలకు పైనే ఉంటున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే.. సెకెండ్ వేవ్ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ అని చెప్పేందుకు ఈ ఒక్క పరిశీలనే చాలు.