ఆనందయ్య ఊరికి కరోనా.. ఇప్పుడేంటి పరిస్థితి?

ఆనందయ్య సొంత ఊరు కృష్ణపట్నంలో కరోనా కేసులు బయటపడ్డాయి. ఆల్రెడీ ఆ ఊరివారంతా ఆనందయ్య మందు వాడేశారు. సోషల్ మీడియాలో అసలు కరోనానే లేని ఊరు కృష్ణపట్నం అంటూ అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది.…

ఆనందయ్య సొంత ఊరు కృష్ణపట్నంలో కరోనా కేసులు బయటపడ్డాయి. ఆల్రెడీ ఆ ఊరివారంతా ఆనందయ్య మందు వాడేశారు. సోషల్ మీడియాలో అసలు కరోనానే లేని ఊరు కృష్ణపట్నం అంటూ అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది. ఆ ఊరివారంతా మాస్క్ లు వాడరని, చుట్టుపక్కల ఊళ్ల ప్రజలు కూడా ఆనందయ్య మందుపై ధైర్యంతో మాస్క్ లు లేకుండానే తిరిగేవారని కూడా చెప్పుకునేవారు.

కానీ ఇప్పుడు ఆనందయ్య సొంత ఊరిని కూడా కరోనా చుట్టుముట్టింది. ఓవైపు నెల్లూరు జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. కృష్ణపట్నం లాంటి ఊరిలో కొత్తగా కరోనా కేసులు బయటపడటం ఆందోళనకు దారితీస్తోంది.

తాజాగా కృష్ణపట్నం గ్రామంలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మరో 27మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వారి ఫలితం తేలాల్సి ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణపట్నంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 2 రోజుల పాటు అదే గ్రామంలో ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు అధికారులు.

ఇన్నాళ్లూ ఆనందయ్య సొంత ఊరు కృష్ణపట్నం వాళ్లు చాలా అదృష్టవంతులు అనుకున్నారు మిగతా ప్రాంతాల ప్రజలంతా. ఆ ఊరితో దూరపు చుట్టరికం ఉన్నవారు కూడా ఆనందయ్య మందు కోసం ఎంతో తహతహలాడిపోతూ బంధువులకు ఫోన్లు కలిపేవారు. 

కృష్ణపట్నంలో మాకు తెలిసినవారున్నారంటూ గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆనందయ్య సొంత ఊరిలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ర్యాపిడ్ పరీక్షల్లో ఇద్దరికి వైరస్ నిర్థారణ కావడం, మరో 27మందికి లక్షణాలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది.

అటు ఆనందయ్య మందుకి అనుమతిచ్చే విషయంలో పురోగతి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా పరిశోధనలు జరిపించి.. కేంద్ర సంస్థపై భారం పెట్టింది. ఇటు టీటీడీ ఆధ్వర్యంలో.. సిబ్బంది మందు తయారీకి రంగం సిద్ధం చేసుకుని ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నారు. హైకోర్టు త్వరగా తేల్చాలని చెప్పినా కూడా వ్యవహారం ముందుకు కదల్లేదు.

మరోవైపు ఆనందయ్య, తన కుటుంబానికి దూరంగా ఇంకా పోలీసుల రక్షణ వలయంలోనే ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం మినహా ఆనందయ్య మందు అసలు ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయం అంతుచిక్కని రహస్యంలా మిగిలిపోయింది.