జనసేనాని జనాలకు కనిపించి చాలా రోజులైంది. పోనీ జనాల సంగతి పక్కనపెట్టినా, జనసైనికులకు కూడా ఆయన దర్శనభాగ్యం కలిగి నెలలు గడుస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సంరంభంలో పాల్గొన్న తర్వాత పవన్ ఉనికి కోల్పోయారు.
కరోనా వల్ల కొన్నిరోజులు హోమ్ క్వారంటైన్లో ఉన్నారని అనుకున్నా.. కనీసం కొవిడ్ తగ్గిన తర్వాత అయినా జనాలకి కనిపించాలి కదా. కానీ పవన్ మాత్రం కేవలం ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో కూడా పవన్ యాక్టివిటీ ఏమాత్రం కనిపించడం లేదు.
రుయా ఆస్పత్రి ఘటన, రఘురామకృష్ణంరాజు అరెస్ట్, బీఏ రాజు మరణం.. వంటి వ్యవహారాల్లో మాత్రమే.. పవన్ తానున్నానంటూ ప్రెస్ నోట్ల రూపంలో బయటపడేవారు. అంతేకానీ కనీసం జూమ్ బ్యాచ్ లాగా కూడా సోషల్ మీడియా దర్శనం ఇవ్వలేదు పవన్ కల్యాణ్. దీంతో అటు జనసైనికుల్లో కూడా అసహనం మొదలవుతోంది.
తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన వీడియోని ఇప్పటి వరకూ జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పిన్డ్ ట్వీట్ గా పెట్టుకున్నారంటే.. అంతకంటే పెద్ద యాక్టివిటీ జరగలేదని వారే పరోక్షంగా ఒప్పుకున్నట్టు.
ఎన్నికలపైపోయాయి, ఎన్నికలపై జనసేన-బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి, ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి.. మరి జనసేన ఇంకా అక్కడే ఆగిపోయింది. దీనికి కారణం ఎవరు?
పవన్ కి ఆల్రెడీ సీరియస్ పొలిటీషియన్ కాదు, సీజనల్ పొలిటీషియన్ అనే పేరుంది. పదే పదే దాన్ని రుజువు చేసేలా ఆయన ప్రవర్తించడం నిజంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు నిరాశ కలిగించే విషయమే. కరోనా కష్టకాలంలో పవన్ నేరుగా జనాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ప్రధాన ప్రతిపక్షం మేమే అవుతామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, కనీసం దానికి తగ్గట్టుగా అయినా ప్రవర్తించాలి కదా.
పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. కరోనా బాధితుల బాగోగులు పట్టించుకుంటున్నారు. మరి అంత ఫాలోయింగ్ ఉండి, పవన్ చేస్తున్నదేంటి..?
నిజంగా పార్టీని పటిష్ట పరచాలన్నా, ప్రజల గురించి పట్టించుకోవాలన్నా పవన్ యాక్టివ్ గా ఉండాలి. నాయకుడే నీరసపడితే.. జనసైనికుల గతేంటి..? పాతికేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని తాబేలు రన్నింగ్ రేసులా చేస్తానంటే.. దారిలో నిద్రపోయే కుందేళ్లేవీ ఈ రాజకీయ రణక్షేత్రంలో లేవు. నేరుగా టార్గెట్ రీచ్ అయ్యే కొదమసింహాలే ఉన్నాయి. సీజనల్ పాలిటిక్స్ చేసినంతకాలం పవన్ కి ముఖ్యమంత్రి పదవి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే పదవి కూడా దక్కదేమో.